మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం కావాలి
* హైదరాబాద్ నగరంలోని గన్ ఫౌండ్రీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు
*
విజేతలకు జ్ఞాపికలు ప్రదానం చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది హమీద్ షేక్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం కావాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది, ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ ఆకాంక్షించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలోని గన్ ఫౌండ్రీ కమ్యూనిటీ హాల్ లో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. వ్యాసరచన పోటీలో గన్ ఫౌండ్రి మహబూబియా ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని సెడాల్ మిశ్రా, నాలుగో తరగతికి చెందిన సుభి చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందారు. విజేతలకు బహుమతుల ప్రదానం కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆవరణలో హమీద్ షేక్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు, విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీ పరీక్షలు దోహదపడతాయని అన్నారు. లేఖనా నైపుణ్యాలను పదునుపెట్టేందుకు వ్యాసరచన పోటీలు, చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు చిత్రలేఖనం పోటీలు ఉపయుక్తమవుతాయని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని, పలు రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. అనంతరం గన్ ఫౌండ్రి కమ్యూనిటీ హాల్ లో యూనివర్సల్ స్టడీ సెంటర్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ట్యూషన్స్ అందిస్తున్న నిర్వాహకులు పరంగి రవిని హమీద్ షేక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.