కాంగ్రెస్ లో మాదిగలకు భవిష్యత్ లేదు
మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
కాంగ్రెస్ లో మాదిగలకు భవిష్యత్ లేదని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ తొలి నాళ్ళ నుంచి ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ లో మాదిగలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నుంచి అధమం వరకు మాలల పెత్తనం నడుస్తుందన్నారు. దామోదరం సంజీవయ్య నుండి భట్టి విక్రమార్క వరకు మాలల ఆధిపత్యం కాంగ్రెస్ లో పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మల్లు అనంత రాములు, జి వెంకటస్వామి కుటుంబాల హస్తాల్లోనే బంధీ అయిందన్న విషయం గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు మాలలకు తలొగ్గి మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన మాదిగలకు రెండు, మాలలకు ఒకటి ఇవ్వాల్సిన ఉన్నప్పటికీ అలా చేయకుండా కాంగ్రెస్ మాలల పక్షమని నిరూపించుకుందన్నారు. మూడు ఎస్సీ రిజర్వ్ డ్ ఎంపి స్థానాల్లో రెండు మాలలకు కేటాయించి మాదిగలకు అన్యాయం చేసిందన్నారు.
మాదిగలతో పార్టీకి ఊడిగం చేయించుకొని మాలలకు పదవులు ఇస్తున్న కాంగ్రెస్ కు మాదిగలు దూరంగా ఉండాలని ఆయన కోరారు.
85 % మాదిగల జనాభా కల్గిన నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం మాలలకు ఇవ్వడం దుర్మార్గమన్నారు.మాదిగ బిడ్డ సంపత్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని,
పార్టీకి సేవ చేయించుకొని టికెట్ నిరాకరించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రోద్బలంతో మాదిగలకు అణచివేత జరుగుతుందన్నారు. మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉండగా మళ్ళీ మల్లు రవికి క్యాబినేట్ హోదా కల్గి ఉన్నప్పటికీ మళ్ళీ ఎంపి టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉండగా మళ్ళీ వాళ్ళ కుటుంబానికే పెద్దపల్లి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు విలువ లేదా?నని, ఇందిరమ్మ పాలన పేరుతో రెడ్డిల పాలన, మాలల పాలన తెలంగాణలో నడుస్తుందన్నారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే రెడ్డిల, మాలల రాజ్యమేనన్నారు.మాదిగలకు భవిష్యత్తులేని కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఓట్లు వేయొద్దన్నారు. రేవంత్ రెడ్డి మాలలకు భయపడి మాదిగల గూర్చి నోరు విప్పడం లేదని,
మాటల్లో మాదిగల గూర్చి ఊకదంపుడు, ఉపన్యాసాలు చేసే రేవంత్ ఆచరణలో మాత్రం చేసేది శూన్యమన్నారు. తన సొంత పార్లమెంట్ నియోజక వర్గం మాదిగలకు ఇప్పించలేని రేవంత్ రెడ్డిని మాదిగలు నమ్మాల్సిన అవసరం లేదన్నారు.జనరల్ స్థానాల్లో ముగ్గురు, నలుగురు అభ్యర్థుల మీద చర్చ జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ స్థానాల్లో ఎలాంటి చర్చలు జరపకుండా మాలలకు ఏకగ్రీవమని ఎలా నిర్ణయించిందన్నారు.
ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ పదవి ఉండగా, డిల్లీలో క్యాబినేట్ హోదా ఉన్న వ్యక్తిని నాగర్ కర్నూల్ ఎంపీ గా ఎందుకు నిర్ణయించారన్నారు.
కాంగ్రెస్ కు దళితులు అంటే మల్లు అనంతరాములు, గడ్డం వెంకటస్వామి కుటుంబాలేనా? అని మంద కృష్ణమాదిగ మండిపడ్డారు.మాదిగ ప్రజలారా ఆలోచించి నిర్ణయం తీసుకోండని, మనకు విలువ లేని కాంగ్రెస్ కు ఓటు వేయోద్దన్నారు. బిఆర్ఎస్ మాదిగలకు బద్ద వ్యతిరేకిన్నారు. బిఆర్ఎస్ పార్టీతో మాదిగలకు ఒరిగేది ఏం లేదన్నారు. పదేళ్లు
అధికారంలో ఉండి మాదిగలను పక్కన పెట్టి పదవులన్ని మాలలకు దొచిపెట్టిందన్నారు.
మాదిగలకు తొమ్మిదిన్నరేళ్లు మంత్రి వర్గంలో స్థానం ఇవ్వలేదన్నారు.అడుగడుగున అణచివేసిన బిఆర్ఎస్ మాదిగలకు ఎప్పటికీ శత్రువేనన్నారు.దళిత ముఖ్యమంత్రి హామీపై మోసం చేసి మాదిగ బిడ్డ డా. తాటికొండ రాజయ్యను అకారణంగా భర్తరఫ్ చేసి మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారన్నారు. బిఆర్ఎస్
రెండు ఎంపి స్థానాలు మాదిగలకు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. వరంగల్ స్థానం సిట్టింగ్ ఎంపీ మాదిగ బిడ్డ పసునూరి దయాకర్ కు ఇవ్వకుండా అన్యాయం చేశారని, కడియం శ్రీహరి కక్కుర్తి మనిషని, మాదిగల అవకాశాలను గుంజుకొని రాజకీయ లబ్ది పొందుతున్న అవకాశవాదన్నారు.మాదిగల ద్రోహి బిఆర్ఎస్ కు మాదిగలు దూరంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీలకు మాదిగలు ఓట్లు వేయకూడదని, మేలు చేసే బీజేపీకి ఓటు వేద్దామన్నారు. కీడు చేసే కాంగ్రెస్ బిఆర్ఎస్ లకు దూరంగా ఉందామన్నారు. నరేంద్ర మోడి ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని,
సుప్రీం కోర్టు విచారణలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను బలపరిచిందన్నారు. మోడీ ఉన్నత కమిటీని వేసి ప్రక్రియను వేగవంతంగా నడిపిస్తున్నారన్నారు. మోడీ మాట ఇస్తే తప్పడని పదేళ్ల పాలనలో పరిష్కారం చేసిన క్లిష్ట సమస్యలు చూస్తే అర్థం అవుతుందన్నారు. మాదిగల పట్ల మోడీ అంకితభావంతో ఉన్నారన్నారు.ఎమ్మెల్యేగా ఓడిపోయిన మురుగన్ అనే మాదిగ బిడ్డను కేంద్రమంత్రిని చేసిన ఘనత మోడీదని, కాంగ్రెస్ ద్వారా ఏనాడు వర్గీకరణ జరగదన్నారు.
వర్గీకరణను చివరి దశకు తెచ్చిన మోడీకే అండగా ఉందామన్నారు.దేశంలో మోడీ, తెలంగాణలో కిషన్ రెడ్డికి అండగా ఉందామన్నారు.కిషన్ రెడ్డి ముప్ఫై ఏళ్ల ఉద్యమానికి నిజమైన మిత్రుడన్నారు.
ఈ ఎన్నికలలో మాదిగ ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలని పిలుపు నిచ్చారు.