స్టీఫెన్ రవీంద్రపై సీఎంకు
గంగాధర్ ఫిర్యాదు
తన సస్పెన్షన్ అక్రమం
హైకోర్ట్ ఆదేశాలు భే ఖాతర్
పోలీసు శాఖలో కలకలం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
కబ్జాదారులతో కుమ్మక్కై తనపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తూ వృత్తి నిబద్దతతో పనిచేసి పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందిన తనపై సైబరాబాద్ మాజీ సీపీ, ప్రస్తుత హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సస్పెన్షన్ వేటు వేయడం అక్రమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమాండ్ కంట్రోల్ డీఎస్పీ మదనం గంగాధర్ ఫిర్యాదు చేశారు. ఈవిషయమై పోలీస్ శాఖలో కలకలం సృష్టించింది. సబార్డినేట్లు తమ ఉన్నతాధికారిపై ఫిర్యాదు చేసే విధానం అన్ని ప్రభుత్వ శాఖల్లో సహజంగా ఉన్నప్పటికి పోలీసు శాఖలో మాత్రం అత్యంత అరుదుగా చోటు చేసుకుంటుంది.

డిసిప్లేనరీ డిపార్ట్ మెంట్ కావడంతో తమకన్నా ఎక్కువ హోదాలో ఉన్న అధికారులపై కింది స్థాయిలో పనిచేసే వారు ఫిర్యాదు చేయడమన్నదే జరగదు. ఆటు పోట్లు ఎదురైనా మిన్నకుండి పోతారు. కానీ తాజాగా ఓ పోలీసు అధికారి ఏకంగా అడిషనల్ డిజీపీపైనే ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. నార్సింగిలో ఇన్సెపెక్టర్ గా పనిచేసిన ఎం.గంగాధర్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్రపై గురువారం ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఓపీటీకి ఈ ఫిర్యాదు కాపీలను పంపించారు. ఓ భూ వివాదంలో తల దూర్చానంటూ ఎలాంటి విచారణ జరపకుండానే తనను సస్పెండ్ చేశారని గంగాధర్ అందులో పేర్కొన్నారు. అప్పటి జిల్లాకలెక్టర్, పోలీసు కమీషనర్ ఆదేశాల మేరకే తాను కేసు నమోదు చేశానని, అయితే ల్యాండ్ గ్రాబర్స్ పై కేసు ఎందుకు పెట్టావంటూ తనను సస్పెండ్ చేశారని గంగాధర్ వివరించారు. శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలోని సర్వే నెంబర్ 68, కొల్లూరు శివారులోని 278 సర్వే నెంబర్ లకు సంబంధించి ఓవర్ లాప్ భూ వివాదంలో కేసులు నమోదు చేశానన్న కారణoతో తనను సస్పెండ్ చేశారన్నారు. సస్పెండ్ అయిన అధికారులపై మూడు నుంచి ఆరు నెలల లోపున డిసిప్లేనరీ యాక్షన్ కమిటీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జీఓ ఉన్నప్పటికీ, తనకు సంబంధించిన ఫైలును కావాలనే ఏడాదిన్నర పాటు పక్కనపెట్టారని గంగాధర్ ఆరోపించారు. తనను సస్పెండ్ చేయడం వల్ల డిపార్ట్ మెంట్లో తన పరువు పోవడమే కాకుండా తన బ్యాచ్ కు చెందిన వారంతా కూడా డీఎస్సీలుగా పదోన్నతి పొందినా తనకు మాత్రం అన్యాయం జరిగిందన్నారు. స్టీఫెన్ రవీంద్ర తన సస్పెన్షన్ వ్యవహారం గురించి ఎలాంటి రిపోర్టు ఇవ్వకపోవడంతో డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ తనకు ప్రమోషన్ ఇవ్వలేదన్నారు. అయితే తన ప్రమోషన్ ను కన్సిడర్ చేయాలంటూ హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో మరోసారి నోటీసులు పంపించాల్సి వచ్చిందన్నారు. అప్పుడు స్టీఫెన్ రవీంద్ర తన ప్రమోషన్ కు సంబంధించిన నివేదిక డీపీసీకి పంపించడంతో ఆలస్యంగా పదోన్నతి పొందానన్నారు. ఆయన నిర్ణయం వల్ల తాను ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉండడంతో పాటు సకాలంలో ప్రమోషన్ పొందలేకపోయానని, తనలా చాలా మంది కింది స్థాయి అధికారులు ఆయన వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓను, హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.