బీసీలకు పెద్ద పీట
పూలే, సావిత్రి పూలేల విగ్రహాల ఆవిష్కరణ
మంత్రి పొన్నం ప్రభాకర్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా
శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ (ఐటి టవర్ వద్ద) ఏర్పాటుచేసిన మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళలకు చదువు ఉండకూడదనే మూఢనమ్మకాలు ఉన్న సమయంలోనే సావిత్రిబాయి పూలే మహిళా చదువు కోసం ఎంతో కృషి చేశారని ,పాఠశాలలను స్థాపించారని అన్నారు. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిదులు మంజూరు చేశామని తెలిపారు.

రాబోయే కాలంలో బలహీనవర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కుల గణను చేపట్టేందుకు నిర్ణయించామని, అలాగే 150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా, వృత్తులకు ఆర్థి పరిపుష్టిని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా కులవృత్తులకు ప్రోత్సాహం, బీసీ పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేలా ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ,గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలను దశలవారీగా తీరుస్తున్నామని చెప్పారు. గురుకులాలు ,వసతి గృహాలలో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు భోజనం, వసతి, బట్టలు, సౌకర్యాలను కల్పిస్తున్నామని, ఇటీవలే గురుకులాలలో 6000 మందిని శాశ్వతంగా నియామకాలు చేపట్టి ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సావిత్రిబాయి పూలే, జ్యోతిబాపూలేల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరిని విద్యావంతులను చేయాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకోసం కృషి చేస్తున్నామని చెప్పారు.గ్రూప్ 1 పరీక్షల్లో బీసీల నుండి 4,500 మంది ఎంపికయ్యారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు 25 వేల రూపాయల పెన్షన్ త్వరలోనే ప్రభుత్వం ఇవ్వనుందని, అదేవిధంగా 250 గజాల ప్రభుత్వ స్థలం ఇచ్చే ఎంపిక కార్యక్రమం త్వరలోనే చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సహకారం అందించే విషయం సైతం మంత్రివర్గంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీలు,అణగారిన వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలతో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లను నిర్మించనుందని తెలిపారు. నల్గొండలో ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద ఈ హాస్టల్ ను నిర్మించనున్నామని ,చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ బాగుపడతారని ,మహిళలు చదివితే కుటుంబం బాగుపడుతుందని, ప్రఘాడంగా విశ్వాసించి మహిళలకు చదువు నేర్పించిన గొప్ప మహానుభావురాలు సావిత్రిబాయి పూలే అని మంత్రి అన్నారు.

ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,మహాత్మ జ్యోతిబా ఫూలే, సావిత్రిబా పూలే ఆశయాలు ,ఆదర్శాల కనుగుణంగా అందరు పనిచేయాలని, లింగ బేధం లేకుండా అందరూ చదువుకోవాలని కోరారు. జిల్లాలోని బిసి గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇతర సమస్యలకు తన ఎమ్మెల్యే నిధుల నుండి కోటి 20 లక్షల రూపాయలు మంజూరు చేసేందుకు మంత్రి సమ్మతి తెలిపారు.జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా బీసీ సంఘం అధ్యక్షు చక్రధర్ రామరాజు తదితరులు మాట్లాడారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ .పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్ గౌడ్ ,వివిధ కుల సంఘాల అధ్యక్షులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.