శ్రమదానంతో దారి గుంతల పూడ్చివేత

 

శ్రమైక జీవన సౌందర్యం

శ్రమదానంతో స్ఫూర్తినిస్తున్న మహిళా ఎస్సై సంధ్య

ఖమ్మం, అక్షిత ప్రతినిధి :

శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేడంటూ మహాకవి శ్రమ గొప్పతనాన్ని శ్రమలోని సౌందర్యాన్ని శ్రమ చేస్తున్న వారి నిబద్ధతను చాటి చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛందంగా శ్రమదానం చేసి శ్రమ గొప్పతనాన్ని మహిళా ఎస్సై నారబోయిన సంధ్య తన నిబద్ధతను తెలియజేశారు. తాను ఎస్ఐగా పనిచేస్తున్న ప్రాంతంలో రహదారులపై గుంతలు ఉండడాన్ని గమనించిన ఎస్ఐ సంధ్య ఈ గుంతల వలన ఎందరో ప్రయాణికులు , వాహనాలపై వెళ్తున్నవారు తరచూ ప్రమాదాలకు గురికావడాన్ని గమనించారు. దీంతో తమ ఆలోచనలకు పదును పెట్టి స్వచ్ఛందంగా ట్రాక్టర్ లో కంకర మోరం తెప్పించి తానే స్వయంగా పార చేతబట్టి ఈ గుంతలను పూడ్చారు. ఎల్లప్పుడూ బాధ్యతలతో బిజీ బిజీగా ఉండే పోలీస్ అధికారి శ్రమదానం చేసి గుంతలు పూడ్చడంతో ఈ ప్రాంతవాసులు ప్రశంసలు తెలియజేశారు.

మధిర టౌన్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారబోయిన సంధ్య మధిర పట్టణంలో స్వచ్ఛందంగా శ్రమదానం నిర్వహించడం అందరికీ స్ఫూర్తినిస్తున్నది. తమ తమ ప్రాంతాలలో స్వల్ప ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రజలు , ముఖ్యంగా యువకులు తమ ప్రాంతంలోని ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి వ్యక్తిగతంగా, బృందాలుగా కృషి చేస్తే గ్రామాలు ,పట్టణాలు, నగరాలల్లో ఇబ్బందులు తొలగిపోయి సానుకూల వాతావరణంలో జీవించగలుగుతారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking