నీళ్లు లేక నెర్రెలు బారుతున్న పొలాలు

నీళ్లు లేక నెర్రెలు బారుతున్న పొలాలు

-తలాపున నీళ్లు ఉన్న పంట తడవని వైనం

వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా ఖమ్మం జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉన్న ఒరిగిందేమీ లేదు

సాగర్ జలాలు రెండు రోజుల్లో వదలకుంటే పోరు తప్పదు 

-తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు 

ఖమ్మం /అక్షిత బ్యూరో :

ఒకవైపు ప్రకృతి బీభత్సం మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి ప్రతిఏటా నిండా మునుగుతున్న రైతన్నలను పట్టించుకునే నాధుడే లేడని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి అనేక వ్యయ ప్రయాసలు కోర్చి పంటలు పండించిన చేతికందే సమయంలో ప్రకృతి బీభత్సాలు రైతన్నను నిత్యం వెంటాడుతూనే ఉన్నాయన్నారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశం రచ్చ నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గుడవర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతన్నలు సాగుచేసిన వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అట్టి వెతల నుండి తేరుకోక ముందే ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతో సాగర్ జలాలను విడుదల చేయకపోవడంతో వేసిన పంటలు నీళ్లు అందక నెర్రలు బారుతున్నాయన్నారు. భారీ వర్షాలతో చెరువులు రిజర్వాయర్లు నిండుకుండల్లా కళకళలాడుతున్న రైతులు సాగు చేసిన పంటలకు నీళ్లు ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతుందని విమర్శించారు. ఇప్పటికే ప్రతి రైతు ఎకరానికి 30 నుండి 50 వేల రూపాయల వరకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారన్నారు. ఒకవైపు ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీ పథకం సంపూర్ణంగా అమలు కాకపోవడంతో తిరిగి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం రైతన్నలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందన్నారు. రుణమాఫీ రాక రైతు భరోసా అందక వేసిన పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లడం వంటి పరిస్థితులు రైతన్నలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నారు. వేసిన పంటలకు నీళ్లు రాక ఇంకా వరినాట్లు వేసేందుకు నీళ్లు లేక రైతన్నలు అల్లాడుతున్నారన్నారు.పోసిన నారుమడులు ముదిరి పోతుండడంతో ఏమి చేయాలో పాలు పోక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. నీట మునిగిన పంటలను సందర్శించడం తప్ప ప్రయోజనం శూన్యమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరో రెండు రోజుల్లో సాగరు జలాలను విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని లేనియెడల రైతులందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి కేవి రామిరెడ్డి నాయకులు ఏటుకూరి రామారావు దుగ్గి వెంకటేశ్వర్లు కట్టెకోల వెంకటేశ్వర్లు బెల్లం లక్ష్మి పగిడికత్తుల నాగేశ్వరరావు మారుతి కొండలరావు ఎడ్ల తిరుపతిరావు రైతు సంఘం నాయకులు ఆలగడప అంజయ్య ఇంటూరి అశోక్ సిరికొండ నాగేశ్వరరావు బలుసు హనుమంతరావు తెల్లమేకల శేషుబాబు చింతలపాటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking