మిస్టర్ సుధీర్ …. సుద్దపూస మాటలొద్దు

మిస్టర్ సుధీర్ ….
సుద్దపూస మాటలొద్దు

కబ్జా చేసి వేల
కోట్లు కూడగట్టలే

నిజాయితీగా సేవ చేసేందుకొచ్చా

పేదల ఇంటికి.. బతుకుకు…

ప్రభుత్వం భరోసా 

సుధీర్ రెడ్డిపై మధు యాష్కీ ఫైర్

నాగోల్, అక్షిత ప్రతినిధి :

మిస్టర్ సుధీర్ ….సుద్దపూస మాటలొద్దు కాంగ్రెస్ అండతో ఎదిగిన సుధీర్ రెడ్డి.. వేలకోట్లు అక్రమంగా సంపాదించి… సుద్దపూస మాటలు మాట్లాడుతున్నాడని, ఎల్బీనగర్ లో ఆయన అక్రమాలు అన్నిటిని వెలికి తీస్తామని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు.మూసీ ప్రక్షాళన డిమాండ్ తో.. మూసీ పరివాహక ప్రాంత రైతులతో నాగోల్ శుభం కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మధు యాస్కి గౌడ్ మాట్లాడారు.

ఇటీవల సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. ”మిస్టర్ సుధీర్ రెడ్డి, నీలాగా ఆస్తులను సేవ్ చేసుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు.. నేను నిజాయితీగా సేవ చేయడానికి వచ్చాను” అని పేర్కొన్నారు.

ప్రజలకు అందుబాటులో లేకుండా మూడు నెలలు ఎక్కడో పడుకొని వచ్చిన సుధీర్ రెడ్డి .. ఈరోజు నీతి సూత్రాలు వల్లిస్తున్నాడని, ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలనుపట్టించుకోవడంలేదని విమర్శించారు.ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన అనుచరులు చెరువులు, కుంటలు కబ్జా చేసి వేల కోట్లు గడించారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన దోపిడీపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. భూపేష్ గుప్తా నగర్ లో 11 ఎకరాల స్థలాన్ని ప్లాట్లు చేసి అమ్ముకున్న చరిత్ర ఎమ్మెల్యేది, ఆయన అనుచరులది అన్నారు. కేసిఆర్, కేటీఆర్ , హరీష్ రావులే కాదు .. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలాంటి వారిపై ఏసీబీతో విచారణ జరిపి అక్రమ సంపాదనను బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

“సుధీర్ రెడ్డి.. నీవు మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ గా చేసినవు కదా…ఎలా చేస్తే బాగుంటదో సలహాలు ఇవ్వు. ఫామ్ హౌస్ లో పడుకున్న నీ నాయకుడిని కూడా తీసుకువచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. అంతేకానీ మీ స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొట్టొద్దు” అని మధుయాష్కి గౌడ్ సూచించారు. కాలుష్యాన్ని నివారించి, మూసీకి పునర్ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలో అన్యాయంగా ఏ ఇంటిని ప్రభుత్వం కూల్చదన్నారు. ప్రజలతో మాట్లాడుతుందన్నారు. “మీ ఇంటికి ప్రభుత్వం గ్యారెంటీ అని, మీ జీవితానికి ప్రభుత్వం భరోసా” ఇస్తుందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కూడా మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని తెలియజేశారని గుర్తు చేశారు. రూ.10వేల కోట్లు ఇందుకు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలకు కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో చేసిన అక్రమాలను బయటపెట్టి విచారణ చేపట్టడం ద్వారా పదేపదే వారు చేస్తున్న అసత్య ఆరోపణలు ఎదుర్కోగలమన్నారు. రైతులకు రుణమాఫీ చేపట్టిన ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వందే అన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ కూడా త్వరలో పూర్తి అవుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking