రైతుల ఆదాయం పెంచేలా ఉపాధి హామీ

*రైతుల ఆదాయం

పెంచేలా ఉపాధి హామీ

*వ‌చ్చే ఐదు మాసాల్లో రూ. 1372 కోట్ల నిధుల‌తో ప్ర‌ణాళిక‌లు*

*ఆమోద ముద్ర వేసిన మంత్రి సీత‌క్క‌*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGS) రాష్ట్రంలో ప‌క‌డ్బందిగా అమ‌లు చేయాల‌ని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌ణాళిక బ‌ద్దంగా ప‌నులు చేయించాల‌ని సూచించారు. రైతుల ఆదాయం పెంచేలా, ఉపాధి హ‌మీ నిధుల‌తో వ్య‌వ‌సాయ‌ అనుబంధ ప‌నుల‌కు ప్ర‌ధాన్య‌త ఇవ్వాల‌న్నారు. శాశ్వ‌తంగా నిలిచేలా ఉపాధి హ‌మీ ప‌నులు చేప‌ట్టాలన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని చెప్పారు.

రాష్ట్రంలో MGNREGS అమ‌లు పై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క శుక్ర‌వారం నాడు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. స‌చివాల‌యంలో త‌న చాంబ‌ర్ లో పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి లోకేష్ కుమార్, క‌మీష‌న‌ర్ అనితా రామ‌చంద్ర‌న్, స్పెష‌ల్ క‌మీష‌న‌ర్ ష‌ఫిఉల్లా, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్ కాంతి వెస్లీ, పంచాయ‌తీ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ క‌న‌క‌ర‌త్నం, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో మంత్రి సీత‌క్క బేటి అయ్యారు. రాబోయే 5 నెలల కాలానికి సంబంధించి రూ. 1372 కోట్ల MGNREGS లో నిధులతో చేపట్టే పనుల ప్రణాళికలకు ఆమోదం తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఉపాధి భ‌రోసా, పంట‌పొలాల‌కు బాట‌లు, పండ్ల తోటల పెంపకం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కింద చేప‌ట్టే ప‌నుల‌ను ఫైన‌లైజ్ చేసారు. రూ. 106 కోట్ల నిధులతో ఇందిరా మహిళా శక్తి కార్య‌క్ర‌మం కింద ప్రతి నియోజకవర్గానికి సుమారు కోటి నిధులను వెచ్చించాల‌ని నిర్ణయించారు. మొత్తం 5,400 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆదాయాన్ని పెంచే దిశ‌లో పశువుల కొట్టాలు, కోళ్ళ షెడ్ల నిర్మాణాం, వర్మి కొంపోస్ట్-వాన పాముల ఎరువుల తయారీకి తోట్ల నిర్మాణం, SHG లో ఉన్న రైతుల బీడు భూములను అభివృద్ధి చేసి సాగులోకి తీసుకొచ్చే ప్ర‌ణాళిల‌కు మంత్రి సీత‌క్క ఆమోదం తెలిపారు.

ఇక ప్రతి నియోజక వర్గానికి రూ. రెండు కోట్లు వెచ్చించి వ్యవసాయ పొలాలకు బాటలు వేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో పాటు 2,700 ఎకరాలలో రూ. 16.20 కోట్ల నిధులతో చిన్న సన్నకారు రైతులకు ఉపాధి హామీ ద్వారా పండ్ల తోటలు, ఈత మొక్క‌ల‌ పెంపకము చేపట్టి ఆదాయాభివృద్ధిని పెంచేలా ప్రాణాళిక‌లు సిద్దం చేసారు. 9 కోట్ల మొక్కలను పెంచి, వచ్చే సంవత్సరం వ‌న మ‌హోత్స‌వంలో నాటడానికి సిద్ధంగా ఉంచాలనే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

దీంతో పాటు జలనిధి కింద‌ వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రాష్ట్రంలో 204 కోట్ల నిధులతో ప్రతి నియోజక వర్గంలో సుమారు రెండు కోట్ల నిధులతో మొత్తం 11,350 నీటి నిల్వ, నీటి సంరక్షణ పనులను చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేసారు. ఇందులో బాగంగా 540 చెక్ డ్యాములు, 540 వ్యయసాయ బావుల నిర్మాణము, వేయికి పైగా బోర్ వెల్ రీఛార్జి గుంతల నిర్మాణం వంటి ప‌నుల‌ను చేప‌డుతారు.

దీంతో పాటు ప్రతి నియోజక వర్గానికి సుమారు 5 కోట్ల నిధులతో గ్రామాలలో మౌలిక వసతుల కల్పించేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసారు. ఇందులో బాగంగా ఇంకుడు గుంతల నిర్మాణం, టాయిలెట్ల‌ నిర్మాణాలు, ఇంటర్నల్ సిమెంటు కాంక్రీటు రోడ్ల నిర్మాణం, వేయి కొత్త గ్రామ పంచాయతి భవనాల నిర్మాణము, 500కి పైగా అంగన్వాడీ భవనాల నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 4960 కోట్ల నిధులతో చేపట్టే పనుల కోసం అధికారులు అంచనా ప్రణాళికలు సిద్దం చేయ‌గా మంత్రి సీత‌క్క ఆమోదం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking