వరంగల్ ను రెండవ రాజధానిగా అభివృద్ధి

వరంగల్ ను రెండవ రాజధానిగా అభివృద్ధి

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్, అక్షిత బ్యూరో :

వరంగల్ మహా నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేయుటకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నగర మేయర్  గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, పి. ప్రావీణ్యలతో కలిసి వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ సుందరీకరణ పనులను, భద్రకాళి చెరువు బొంది వాగు వరద నివారణ పనులను, నిర్మిస్తున్న భద్రకాళి మాడ వీధులను పరిశీలించి పనులలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువు బొంది వాగు వరద నివారణకు ప్రభుత్వం 158 కోట్లు మంజూరు చేసిందని,బొంది వాగు నాలా, భద్రకాళి నాలా, భద్రకాళి క్యాష్మెంట్ ఏరియా లలో చేపట్టే వరద నివారణకు సంబంధించిన అభివృద్ధి పనుల మ్యాప్ ను మంత్రి పరిశీలించి, వివరాలు అధికారులను అడిగి తెలుసుకుని సమర్థవంతంగా ఆయా పనులు నిర్వహించుటకు మంత్రి తగు సూచనలు చేశారు.


భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ క్రీస్తుపూర్వం 600 ఏళ్ల క్రింద నిర్మించిన భద్రకాళి అమ్మవారి దేవాలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమం, ఉమ్మడి నిజాంబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల నుండి భక్తులు వస్తారని,ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి రెండవ రాజధానిగా అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
వరంగల్ సమగ్రాభివృద్ధి చర్యల్లో భాగంగా భక్తుల అభిరుచికి అనుగుణంగా భద్రకాళి ఆలయం, మాడ వీధులను ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ధి. చేస్తామని అన్నారు. ఆలయాన్ని అనుకొని ఉన్న చెరువు ను అభివృద్ధి చేయడానికి పరిశీలించడం జరిగిందని, సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు పూడిక పేరుకుపోయి, చెరువు లోతు తగ్గి సమాంతరంగా మారడం కారణంగా నీరు నిలువ సామర్థ్యం తగ్గిపోయిందని, వెంటనే చెరువు పూడికతీతకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశిoచడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చిన వెంటనే వరంగల్ ప్రాంత వాసులకు ఎయిర్పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకురానట్లు తెలిపారు. ఓ ఆర్ ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు లతో పాటు రాబోయే 30 సంవత్సరాల వరకు నగర ప్రజలకు అవసరమగు మౌలిక వసతులు, అండర్ డ్రైనేజీ, ఎలక్ట్రిఫికేషన్ తదితర మౌలిక వసతులు కల్పించుటకు ప్రణాళికలను తయారు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజీ నారాయణరావు కళా క్షేత్రాన్ని, పట్టణానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని. మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సర్వే చేయించి అక్రమ నిర్మాణం తొలగిస్తామని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమాల్లో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, కుడా పిఓ అజిత్ రెడ్డి, జిడబ్ల్యుఎంసి ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు భీం రావు, సంతోష్ బాబు, సీతారాం, ఇరిగేషన్, కూడా, జిడబ్ల్యూ ఎంసీ, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking