ఫీజుకు డబ్బుల్లేక కూలీకి వెళ్తున్న గిరిజన బిడ్డ
*ఆర్థిక, సామాజిక స్థిరత్వం సాధించేందుకు చదువే మార్గమని …ఆ దిశగా అడుగులు
మిర్యాలగూడ నవంబర్ 24 అక్షిత ప్రతినిధి :
ప్రస్తుతం ఓ హార్టికల్చర్ కళాశాలలో సీటు వచ్చిన ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక నిరుపేద గిరిజన బిడ్డ కూలీ పనుల బాట పట్టింది. తన లక్ష్యం చేరుకునేందుకు సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తోంది మౌనిక.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ /తండ గ్రామానికి చెందిన నూనావత్ లింగా, శాంతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు మౌనిక, కల్యాణీలు కాగా మౌనిక మూడేళ్ల వయసులో తల్లి మరణించగా నాన్న మరో పెళ్లి చేసుకొని తన దారి తాను చూసుకున్నాడు. అప్పటినుండి అక్క చెల్లెలను వాళ్ళ అమ్మమ్మ బాణావత్ లచ్చి మామయ్య శ్రీను వీళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. మౌనిక చదువు కోసం నల్గొండ చారుమతి అనాధశ్రమంలో చేర్చారు.
చదువుపై తనకున్న ఆసక్తితో బైపీసీ విభాగంలో 9.9 గ్రేడ్ మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. పసి ప్రాయంలో తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఆ యువతీ జీవితంలో ఉన్నతంగా స్థిర పడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. శ్యామల నాగసేనారెడ్డి ప్రోత్సాహంతో ఈఏపీ సెట్, నీట్ పరీక్షలను రాసింది. దీంతో మహబూబాబాద్ జిల్లా మాల్యాలలోని హార్టికల్చర్ కళాశాలలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. అయితే అమ్మమ్మ బాణావత్ లచ్చి, మేనమామ శ్రీను కొంత చదువులకు సాయం చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఫీజు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో తన చదువును కొనసాగించేందుకు అవసరమైన ఫీజు చెల్లింపుకు ఉన్నత చదువుకు వ్యాపార, సామాజిక వేత్తలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. చదువుకొని డాక్టర్ అవుతానని తర్వాత నాలాంటి వారికి చేయూతనిస్తానని అంటున్న మౌనిక.