మాజీ మేయర్ రేఖా గుప్తా… ఢిల్లీ సీఎం

మాజీ మేయర్ రేఖా గుప్తా
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి :

మొదటిసారి ఎమ్మెల్యేగా ఆమె అసెంబ్లీలో అడుగుపెడుతోంది! ఆ అడుగు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండటం విశేషం! మన తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి ఎమ్మెల్యే గా గెలిస్తే రాజకీయ అనుభవం లేదని చిన్నచూపు చూస్తారు! పదవుల విషయంలో పేరు కూడా తీసుకోరు! అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం కూడా అంతంత మాత్రమే!

ఒకనాటి స్టూడెంట్ లీడర్ రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పబోతున్నారు! 1996 లో రేఖ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ గా మొదటిసారి ఎన్నికలు ఎదుర్కొని సెక్రటరీ అయ్యారు! ఆ తరువాత ఏడాది అధ్యక్షురాలు అయ్యారు! ఢిల్లీలో మూడు సార్లు బిజెపి పార్టీ కౌన్సిలర్ గా గెలిచారు! దక్షిణ ఢిల్లీ మేయర్ గా గుర్తింపు పొందారు! మొదటి నుంచి ఆమె స్లోగన్ ఒక్కటే నా పని చూడండి నన్ను గెలిపించండి! అదే జనానికి నచ్చి ఓటమి ఎరుగని నేతగా దిగ్విజయంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో మొదటిసారి షాలీమార్ బాగ్ నియోజకవర్గం ఎమ్మెల్యే గా బిజెపి నుంచి నిలబడి ఆప్ అభ్యర్థి బంధన కుమారిని 29595 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు.

ఆమె ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి విద్యార్థి రాజకీయాల్లో ఎబివిపి నేతగా ఎదిగారు. ప్రస్తుతం బిజెపి జాతీయ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా పార్టీకి ఢిల్లీ లో సేవలు అందిస్తూ మోదీ, అమిత్ షా లను ఆకట్టుకున్నారు! గతంలో ఆమె ఢిల్లీ బిజెపి పార్టీ కార్యదర్శిగా కూడా పని చేశారు! రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా వ్యాపారరంగంలో ఉన్నారు. బిజెపి పార్టీ నేతగా కొనసాగుతున్నారు. వీరికి ఇరువురు సంతానం నికుంజ్ గుప్తా, హర్షిత గుప్తా! హర్షిత చదువు పూర్తి చేసుకుని తండ్రి వ్యాపారం చూసుకుంటోంది! నికుంజ్ డిగ్రీ చదువుతున్నట్లు సమాచారం. తన రెండవ ఏట హరియాణా నుంచి ఢిల్లీ కి వలస వచ్చిన కుటుంబం. తండ్రి బ్యాంక్ మేనేజర్ గా పదవీ విరమణ పొందారు. రేఖ పూర్తి పేరు రేఖా రాణి. వివాహం అనంతరం రేఖా గుప్తా గా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె వయసు 50.

ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మళ్ళీ మహిళను వరించింది! గతంలో షీలా దీక్షిత్ చాలాకాలం కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగి మంచి పేరు తెచ్చుకున్నారు! ఆమెకు ముందు సుష్మా స్వరాజ్ బిజెపి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు! ఇన్నాళ్లకు మళ్ళీ బిజెపి పార్టీ మహిళా ఎమ్మెల్యేకు అవకాశం లభించింది! బిజెపి పార్టీ ఢిల్లీ రెండవ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు అవకాశం లభించింది. ఢిల్లీ పీఠం పార్టీలతో సంబంధం లేకుండా చూస్తే రేఖ నాలుగో మహిళా ముఖ్యమంత్రి! రేఖకు ముందు అతిషి కొంత కాలం ఆప్ సిఎం. భారతదేశంలో వైశ్య వర్గం నుంచి ముఖ్యమంత్రి అయినవారిలో రేఖా గుప్తా రెండవ వారు! ఆంధ్రప్రదేశ్ నుంచి కొణిజేటి రోశయ్య ఆ వైశ్య వర్గం తొలి ముఖ్యమంత్రి గా రికార్డు నెలకొల్పారు! వైశ్య వర్గంలో ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ గా రేఖా గుప్తా రికార్డు సృష్టించారు! నిన్నటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి గా పర్వేష్ వర్మకు అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ, నడ్డా చక్రం తిప్పి అనూహ్యంగా రేఖా గుప్తాను తెర పైకి తెచ్చారు! దేశంలో 15 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉండగా అందరూ పురుష అభ్యర్దులే ముఖ్యమంత్రులుగా ఆ పార్టీ నియమించింది. ఇప్పుడు అనూహ్యంగా  ఢిల్లీ పీఠం మహిళకు కేటాయించింది! ఆ అదృష్టం రేఖను వరించింది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking