జగదీష్ నోరు
అదుపులో పెట్టుకో
పిఎసిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్
మాడుగులపల్లి, అక్షిత న్యూస్ :
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యులు, వేములపల్లి పిఏసిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్ హెచ్చరించారు. శనివారం మాడుగులపల్లి మండల పరిధిలోని ఇసుకబావిగూడెం గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్థాయికి మించి విమర్శించడం తగదన్నారు. జగన్ తో అంటకాగి తెలుగుదేశం పార్టీ అధినాయకుని చూసి రాజకీయంగా భయపడుతూ విమర్శించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తెలంగాణ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తారన్నారు. టిఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోతూ తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు భయపడుతూ చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకులు… తెలుగుదేశం పార్టీని, అధినాయకుని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. పల్లెల్లో ఇప్పటికే గులాబీ మసకబారిందని, వారి మనుగడ కూడా ప్రశ్నార్థకమైందన్నారు. గత ఎన్నికల్లో ఏదైతే ఫలితాలు వచ్చాయో మళ్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొస్తే అవే ఫలితాలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. కెసిఆర్ తన తన కుటుంబ రాజకీయాలను సరిదిద్దుకోలేక చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సాగర్ నీటి జలాల పైన గతంలో జగన్మోహన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డిలకు చెంచాగిరి చేసిన మాట వాస్తవం కాదా ?నన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ ప్రజలకు అందించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ఆర్థిక వెనుకబాటు తనానికి కేసీఆర్ కారణమన్నారు. తెలంగాణను పదేళ్లు పరిపాలించిన తర్వాత కూడా సెంటిమెంట్ ని రెచ్చగొడుతూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం శాసనసభ్యుడుగా కూడా కెసిఆర్ పనికిరాడన్నారు. నిజంగా ప్రజల పట్ల మమకారం ఉంటే జగదీశ్ రెడ్డి, కేసీఆర్ లు రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్ళవలసిందిగా డిమాండ్ చేశారు. ఆయన వెంట తెలంగాణ తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు షేక్ రసూల్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కట్టా అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.