సాధారణ ప్రసవాలను చేయాలి

సాధారణ ప్రసవాలను చేయాలి

త్రిపురారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు

త్రిపురారం, అక్షిత న్యూస్ :

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయిలో సాధారణ ప్రసవాలను చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టరు, ఓపి రిజిస్టర్, స్టేరిలైజేషన్ రిజిస్టర్ లను పరిశీలించి సిబ్బంది నూటికి నూరు శాతం హాజరు ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపి రోజుకు 40 నుండి 50 మంది వస్తున్నారని తెలుసుకొని ఓపిని పెంచాలని, వచ్చిన ప్రతి పేషెంట్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ,ఏలాంటి రోగులు పిహెచ్ సి కి వస్తున్నారని డాక్టర్ రమావత్ శంకర్ ను అడగగా, షుగర్,బి పి పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని ,ఎల్సిడి, జ్వరంతో బాధపడే కేసులు వస్తున్నాయని డాక్టర్ బదులు ఇచ్చారు. గత నవంబర్ నుండి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలో సంభవించిన శిశు మరణాల వివరాలు అడుగగా, నవంబర్లో మాత్రమే ఒక కేసు నమోదయిందని, ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని డాక్టర్ చెప్పారు. ఎన్ని ప్రసవాలు చేస్తున్నారని ప్రశ్నించగా? జనవరి ఫిబ్రవరిలో ప్రసవాలు చేయలేదని తెలుసుకొని పి హెచ్ సి పరిధిలో తప్పనిసరిగా ప్రసవాలు నిర్వహించాలని చెప్పారు.


కొత్తగా పెళ్లయిన వారికి ,గర్భిణీ స్త్రీలకు వారు తీసుకునే పౌష్టికాహారం పై అవగాహన కల్పించే విధంగా ఆశలకు శిక్షణ ఇవ్వాలన్నారు. త్రిపురారం పిహెచ్ సి పరిధిలో ఎలాంటి మాతా మరణాలు లేవని డాక్టర్ కలెక్టర్ కు తెలిపారు .ఎన్సిడి, పిసిడి కేసులు,అంబులెన్స్ ఇతర సౌకర్యాలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా త్రిపురారం పిహెచ్ సి పాతబడిపోయినందున మరమ్మతులు లేదా కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని వైద్యాధికారి కోరగా తప్పనిసరిగా మంజూరు చేస్తామని తెలిపారు.

ఆ తర్వాత జిల్లా కలెక్టర్ తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రేషన్ కార్డుల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తుల అప్లోడింగ్ ను కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో పరిశీలించారు. 135 దరఖాస్తుల కొత్తగా వచ్చాయని ,వాటిలో 5 దరఖాస్తులు అప్లోడ్ చేయడం జరిగిందని, 75 దరఖాస్తులు పరిశీలన పూర్తి చేశామని తహసీల్దార్ ప్రమీల జిల్లా కలెక్టర్ కు వివరించారు. గ్రామాలలో దరఖాస్తుదారులు అందుబాటులో ఉండకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని తెలుసుకొని తక్షణమే వారు అందుబాటులో ఉండే విధంగా టామ్ టామ్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. మండలంలో చౌకధర దుకాణాల ఖాళీలు ఉన్నాయని తెలుసుకొని వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో వంటగదిని, స్టోర్ రూమ్ ను తనిఖీ చేసి వంట సరుకులు, కిచెన్, అన్ని శుభ్రంగా ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా వంటామనిషి పోస్ట్ ఖాళీగా ఉందని తెలుసుకుని తాత్కాలికంగా భర్తీ చేస్తామని ఎస్ఓ విజయలక్ష్మికి తెలిపారు.8, 10 వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. హిందీ, గణితం, సైన్స్ సబ్జెక్టులపై వారికి ప్రశ్నలు వేసి జాబులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక పాపులర్ గురించి, చదువు ప్రాముఖ్యత గురించి చెప్పారు. బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం, పెద్దదేవులపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ కూడా సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపి రిజిస్టర్లను తనిఖీ చేశారు. కాగా ప్రతిరోజు పిహెచ్ సి కి 30 నుండి 40 మంది వస్తారని, అక్టోబర్లో 80 మంది వరకు పేషెంట్లు వస్తారని ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం డాక్టర్ ప్రియాంక ,డాక్టర్ శిరీషలు జిల్లా కలెక్టర్ కు వివరించగా ..ఏఎన్ సీ రిజిస్టర్ ,మొదటి మూడు నెలల్లో ఏఎన్ సి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో బాలింతలకు ఓఆర్ ఎస్ పాకెట్లు ఇచ్చేలా అంగన్వాడీలకు ఇవ్వాలని,
పిహెచ్ సి పరిధిలో మాత మరణాల గురించి అడగగా ,గత సంవత్సర కాలంలో ఎలాంటి మాత మరణాలు సంభవించలేదని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ,చిన్నపిల్లలకి పౌష్టికాహారం, యాంటీనాటల్ పరీక్షలు, తదితర అన్ని అంశాలపై ఆశాలతో సమీక్షించాలని అన్నారు. పెద్దదేవులపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలో అబార్షన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని గమనించిన జిల్లా కలెక్టర్ ఒక అబర్షన్ పేసెంటు కే .మనిషాతో ఫోన్లో మాట్లాడి రెండుసార్లు అబార్షన్ చేయించుకునేందుకు ఉన్న కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి అబార్షన్ చేయించుకోవద్దని అవసరమైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. పి హెచ్ సి పరిధిలో యాంటివీనం, ఏఆర్ వి ,విటమిన్ కె వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసి డాక్టర్లను అభినందించారు. జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీవో విజయ్ కుమారి, కేజీబీవీ ఎస్ఓ విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking