స్నేహం ఆసరాగా చోరీ
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ – ఇద్దరు అరెస్ట్
నిందితుడి వద్ద రూ. 20 లక్షల ఆభరణాలు స్వాధీనం
గాజులరామారం, అక్షిత న్యూస్ :
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ కె. సురేష్ కుమార్ మీడియాకు వివరాలు అందించారు. బాచుపల్లి పరిధి ప్రగతి నగర్ కాకతీయ హిల్స్‌లో మార్చి 22న ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
స్నేహాన్ని ఆసరాగా చేసుకుని చోరీ
దర్యాప్తులో పాత నేరస్తుడు మహమ్మద్ నాసర్ ఈ కేసులో నేరం చేసినట్టు గుర్తించారు.

అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ ఇంటి యజమానురాలు అతని రెండవ భార్య శోభ రాణి స్నేహితురాలు అని తేలింది. స్నేహితురాలు నిత్యం బంగారు ఆభరణాలు ధరించడాన్ని గమనించి, నాసర్ ఆమె ఇంట్లో భారీగా బంగారం ఉంటుందని అంచనా వేశాడు. తన భార్యతో కలిసి చోరీకి పన్నాగం పన్నాడు. మార్చి 22న ఆ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నాసర్, తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాను పగులగొట్టి 25 తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు దొంగిలించాడు. అనంతరం వాటిని తన భార్య శోభారాణి వద్ద ఉంచాడు.
చోరీ చేసిన ఆభరణాలతో పట్టుబడ్డ నిందితుడు
మార్చి 26న నాసర్ ఆభరణాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బాచుపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి మొత్తం రూ. 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నాసర్ గతంలో ఆరు కేసుల్లో నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించాడు. గతంలో పి.డి యాక్ట్ కింద జైలుకు పంపించామని, అక్కడి నుంచి విడుదలైన తర్వాత మారకుండా మళ్లీ నేరాలకు పాల్పడ్డాడని డీసీపీ తెలిపారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత
సమాచారం షేర్ చేయొద్దు
డీసీపీ సూచన
ఈ కేసు గురించి మాట్లాడుతున్న డీసీపీ కె. సురేష్ కుమార్, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా తమ సెలవులు, ట్రిప్స్, ఇంట్లో ఎవరూ లేని సమయం వంటి సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించొద్దని హెచ్చరించారు. “ఈ రోజుల్లో నేరస్తులు సోషల్ మీడియాను గమనిస్తూ, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా తీసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ప్రజలు తాము ఇంట్లో లేని సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ఎక్కడికెళ్లిన వివరాలను పోస్టు చేయకూడదు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని చెప్పే విధంగా సమాచారాన్ని బహిరంగంగా ఉంచొద్దు,” అని ఆయన సూచించారు.
నిందితుల రిమాండ్
నిందితుడు నాసర్, అతని రెండవ భార్య శోభ రాణిని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన బాచుపల్లి పోలీస్ టీమ్‌ను అభినందిస్తూ, వారికి డీసీపీ రివార్డులు అందజేశారు.