శ్రీరాముని జీవితం.. అందరికీ ఆదర్శం
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ..
– జోగిపేటలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి..
అందోలు, అక్షిత ప్రతినిధి:
శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జోగిపేటలోని ప్రసిద్ధ పబ్బతి హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద 17వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల చిట్టి బాబు, రాధిక దంపతుల చేతుల మీదుగా నిర్వహించిన సీతారామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రికి ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆయనకు సత్కారం జరిపారు. ఆలయ పరిసర ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాముని ధర్మపరాయణత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమ భక్తులు జీవితంలో అనుసరించాల్సిన అంశాలన్నారు.

అలాంటి మహనీయుని కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు.శ్రీ రాముడు ధర్మాన్ని, సత్యాన్ని కాపా డమ న్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మంచి నడవడిక అల వాటు చేసుకోవాలన్నారు. భక్తి భావాన్ని పెంపొం దించుకు న్నప్పుడే మనిషి జీవితం సాఫల్యం అవుతుందన్నారు.
*ఘనంగా సీతారాముల కల్యాణం…*
జోగిపేట పబ్బతి హనుమాన్ దేవాలయం శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీతా రాముల కళ్యాణమహోత్సవ వైభవంగా సాగింది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగామాజీ కౌన్సిలర్ ఆకుల చిట్టి బాబు, రాధిక దంపతుల చేతుల మీదుగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. రామానుజాచార్యుల సాంప్రదాయం ప్రకారం, వేద మంత్రాల నడుమ సీతారాముల కల్యాణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను వీక్షించారు.భక్తులు ఆనందంగా, శ్రద్ధగా కళ్యాణం తిలకించి ఆధ్యాత్మికతను ఆస్వాదించారు.కళ్యాణానంతరం పూజలు, తీర్థ ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ, క్యూలైన్ ఏర్పాట్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణోత్సవం భక్తులు తరలివచ్చేలా చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయంగా నిలిచాయి. రాష్ట్ర మంత్రి హాజరైన నేపథ్యంలో ఈ వేడుకకు మరింత పటిష్టత, మహాత్మ్యం చేకూరింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.