సమస్యల సాధనకు పోరు బాటే

సమస్యల సాధనకు పోరు బాటే

టీయూడబ్ల్యూజేతోనే జర్నలిస్టులకు మేలు

పనిచేసే ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడేషన్

రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలోనే అతి పెద్ద జర్నలిస్టుల సంఘంగా టీయూడబ్ల్యూజే నిరంతరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే-ఐజేయు) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ స్పష్టం చేశారు. జర్నలిస్టుల పక్షపాతిగా నిలబడి, వారి సంక్షేమం కోసం నిస్వార్థంగా పోరాడే శక్తి కేవలం తమ సంఘానికే ఉందని, గత 65 యేండ్ల నుండి జర్నలిస్టులకు మేలు చేస్తుండడం వల్లే ఈ సంఘాన్ని విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే- ఐజేయు మొదటి కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు ఎండి సలీమ్ పాషా అధ్యక్షతన ఎల్ బీ నగర్ లో శనివారం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డితో కలిసి విరహత్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విరహత్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లాలో యూనియన్ బలోపేతంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలన్నీ ఉమ్మడి రాష్ట్రంలో తమ సంఘం సాధించినవేనని, గత పదేళ్ల కాలంలో జర్నలిస్టులకు ఆశించిన ప్రయోజనాలేమి లేవని విరాహత్ విచారం వ్యక్తం చేశారు. ఓ వైపు మీడియా సంస్థలకు బాసటగా నిలిచి, మీడియా స్వేచ్ఛను పరిరక్షిస్తూనే, మరోవైపు జర్నలిస్టుల గొంతుకగా నిలబడి, వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాటాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. నాటి నుండి నేటి వరకు తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయలేదని, ఏ ప్రభుత్వానికి వత్తాసు పలకలేదని, జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాడుతుందన్నారు. నేడు ప్రజల్లో మీడియా పట్ల విశ్వాసం సన్నగిల్లిపోవడానికి కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిపై తమ సంఘం ప్రత్యేక దృష్టి సారించినట్లు విరాహత్ స్పష్టం చేశారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిని అపవిత్రం చేసే శక్తులకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. అక్రిడేషన్ కార్డులు మరోసారి పొడిగింపు ఉండదని, జూన్ నెలలో ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. కోర్టు కేసుల వల్ల కొంత సమయం పట్టిందని కమిటీ వేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్లు త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయి అక్రిడేషన్ కమిటీలు వేయనున్నట్లు విరహత్ అలీ పేర్కొన్నారు.
యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజాన్ని తమ సంఘం ప్రోత్సహిస్తుందని చెప్పారు. తమ సంఘానికి ఉన్న సుదీర్ఘ పోరాటాల చరిత్ర, హక్కుల సాధనతోనే రాష్ట్రంలో వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని, అదరాభిమానాల్ని చూరగొంటున్నట్లు ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం త్వరలో జిల్లా ఇంచార్జ్ మంత్రి,అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.జిల్లా అధ్యక్షులు ఎండి సలీమ్ పాషా మాట్లాడుతూ జిల్లాలో గత పదేళ్లుగా 5 లక్షల ప్రత్యేక భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జర్నలిస్టులకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి దశల వారిగా ఉద్యమిస్తాం అన్నారు.ఈ సందర్భంగా విరహత్ అలీ చేతులమీదుగా 5 లక్షల భీమా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలో ఎల్ బి నగర్ లో జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.ఈ సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీశైలం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాధ కిషన్,మాజీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్,భాస్కర్,దుపమ్ ప్రసాద్, శశి పాల్, మధు కుమార్, షకీల్,ప్రణయ్ ముదిరాజ్, సత్యనారాయణ, నరసింహా రావు, సురేందర్, సుభాష్ రెడ్డి, శేఖర్, ఆంజనేయులు, కృష్ణ, కరుణాకర్, పాండు యాదవ్, దర్శనం జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking