విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ హెచ్చరిక
వరంగల్,అక్షిత బ్యూరో:
విత్తనాలను అధిక ధరలకు అమ్మితే ఫర్టిలైజర్ షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని
పరమేశ్వర వితన విక్రయ దుకాణం, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్, రసీదు పుస్తకాలు, ధరల పట్టిక, తూకం యంత్రం, విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని, సంబంధిత కంపెనీ పేరుతో రసీదు తప్పనిసరిగా రైతులకు అందించాలని ఆదేశించారు. కల్తీ, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరలకు అమ్మితే షాపు లైసెన్స్ రద్దుచేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దుకాణంలో నిల్వల వివరాలను ప్రతిరోజు వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏ దామోదర్, వ్యవసాయ అధికారి కృష్ణ తదితరులు ఉన్నారు.