వికలాంగులకు ఉచిత పయనం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలో ఓ ఆటోరిక్షాపై వికలాంగులు, వృద్ధులు, బిక్షగాళ్లకు ఉచిత ప్రయాణం అని రాసి అక్షరాల అమలు చేస్తున్న విశాల హృదయం, సేవా దృక్పధం కలిగిన అందుగుల సైదులు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కుగ్రామం కొత్తూరుకు చెందిన ఆయన 2 సంవత్సరాలుగా ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, బిక్షగాళ్లు నడిచి వెళ్లే సమయంలో తన దారిలో ఉంటే వెంటనే వారిని ఆటో రిక్షాలో ఎక్కించుకుని వారి గమ్యాన్ని చేరుస్తున్నారు. దీని వల్ల వచ్చే ఆదాయం తగ్గి పోతున్నదా అని ప్రశ్నిస్తే తన ఆటోలో రోజుకు ఐదారుగురు ఉచితంగా ప్రయాణించిన 800 నుండి 1000 రూపాయల వరకు ఆదాయం వస్తున్నదని ఎలాంటి బాధ లేదని తృప్తిగా ఉందని సైదులు అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సిఎన్జీ ఆటో కొనుగోలు చేసి పాత పద్ధతిలోనే సేవలందిస్తున్నానని ఆయన తెలిపారు. ఎందుకు ఇలా సేవలందిస్తున్నావని మనసులో సహాయం చేయాలని వచ్చింది చేస్తున్నానన్నారు. ఆయన చేస్తున్న సేవకు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.