సిద్ శ్రీరామ్ కు గద్దర్ ఫిల్మ్ అవార్డు
– ‘నిజమేనే చెబుతున్నా’ పాటకు ఈ అవార్డు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అందజేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘నిజమే నే చెబుతున్నా’ పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా సిద్ శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు నన్ను తమలో ఒకరిగా భావించి చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తెలుగులో పాటలు పాడటం ఆరంభించి దశాబ్దం అయిందన్నారు. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం అన్నారు. ఈ గుర్తింపు నాకు చాలా ప్రత్యేకమైనదన్నారు.

‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం 2024లో విడుదలైంది. అందులో ఈ పాట భారీ విజయం సాధించింది. అద్భుతమైన సాహిత్యం, హృదయాన్ని హత్తుకునే స్వరం ఈ పాటను అత్యుత్తమంగా నిలిపింది. దీనిని యూట్యూబ్‌లో 174 మిలియన్లకు పైగా చూశారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ విప్లవ కవి గద్దర్ పేరు మీద ఏర్పాటు చేశారు. ఈ అవార్డులను తెలుగు సినిమా పరిశ్రమలో విశేషంగా నిలిచిన సినిమాలు, నటీనటులు, ఇతర విభాగాలను గౌరవించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. సిద్ శ్రీరామ్ ఈ సంవత్సరంలో తన కొత్త మ్యూజిక్ వెంచర్ ది హైబ్రిడిస్ట్ (వార్నర్ మ్యూజిక్ ఇండియాతో కలిసి) రెండు సింగిల్స్ విడుదల చేశారు. అందులో ఒకటి శివనార్ అనే భక్తి గీతం, రెండోది కన్నే / ఎన్ కథా అనే తెలుగు, తమిళంలో విడుదల చేశారు. ఈ రెండు గీతాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.