గుండెపోటుతో బాలానగర్ జోన్ ఎస్వోటీ కానిస్టేబుల్ మృతి
పోలీసు లాంఛనాలతో ప్రవీణ్‌కు వీడ్కోలు
అక్షిత న్యూస్ / గాజులరామారం : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్ ఎస్‌వోటీలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రవీణ్ యాదవ్ (38) గుండెపోటుతో మృతి చెందారు. శనివారం రాత్రి కుత్బుల్లాపూర్‌లో గంజాయి ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎన్టీఆర్ నగర్‌లో ఓ ఇంటిపై తనిఖీలు చేపడుతుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది ఆయనను చింతల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.

ప్రవీణ్ స్వస్థలం మచిలీపట్నం కాగా, ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాపునగర్ శ్రీ సాయి భవన్ అపార్ట్మెంటులో నివాసముంటున్నారు. ఆయనకు భార్య జానకి, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య జానకి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోలీసు గౌరవాలతో అంతిమయాత్ర

ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు బాపునగర్‌లోని శ్రీ సాయి భవన్ అపార్ట్మెంట్ వద్ద ప్రవీణ్ అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. బాలానగర్ ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్ గుప్తా, ఎస్వోటీ సీఐ శివకుమార్, మేడ్చల్ ఎస్వోటీ సీఐలు, జీడిమెట్ల సీఐ గండ మల్లేష్, ఎస్ఐలు గౌతం తదితర అధికారులు పాల్గొని గౌరవ వందనం ఇచ్చారు. “ప్రవీణ్ విధి నిర్వహణలో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు, ఆయన మృతి మా పోలీస్ వ్యవస్థకు తీరని లోటు,” అని తోటి సిబ్బంది భావోద్వేగంతో తెలిపారు.