నాగారం, అక్షిత న్యూస్ : వర్షాకాలం రాగానే మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరం, డయేరియా వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దావఖానకు చెందిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, జిఎన్ఎమ్ లు, సూపర్వైజర్లు గ్రామాల్లో తమ విధులను సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంది. అయితే వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన ఈ సిబ్బంది కేవలం మొక్కుబడిగా గ్రామానికి వచ్చి హాజరు నమోదు చేసి వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే చేయడం, మందులు అందించడం, ప్రజలకు అవగాహన కల్పించటం వంటి పనులు చాలావరకు నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని, గత్యంతరంలేని అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేట్ క్లినిక్ లు లేదా అనధికార మెడికల్ షాప్ లపై ఆధారపడుతున్నారమని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు ఆర్థికంగా నష్టపోతున్నారని పలువురు అంటున్నారు. ఆశా వర్కర్లు పేరుకే వస్తున్నారు ఏఎన్ఎంలు మందులు ఇచ్చే పరిస్థితిలో లేరని, జిఎన్ఎమ్ లు క్యాంపుల్లో కూడా సరిగా కనిపించడం లేదని, సూపర్వైజర్లు పర్యవేక్షణ పేరుతో ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతున్నారని గ్రామ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్నది ఏమిటంటే గ్రామస్థాయిలో సిబ్బంది నిజాయితీగా పనిచేయకపోతే సీజన్ వ్యాధులు అదుపుతప్పే అవకాశం ఉందని, ప్రజల ప్రాణాలకు సంబంధించి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే, ఆరోగ్య సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం అనే అమూల్యమైన బాధ్యత తను మొక్కుబడిగా కాకుండా సమగ్రంగా నిర్వర్తించేలా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని, సంబంధిత అధికారులు కూడా వీరిపై సరైన పర్యవేక్షణ లేదని, ఆఫీసులకే పరిమితమౌతున్నారని విశ్లేషకులు సూచిస్తున్నారు.