ఉద్యమ శిఖరం… కొండా 

ఉద్యమ శిఖరం… కొండా 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తాను నమ్మిన సిద్ధాంతాల కోసం తన వయసును కూడా లెక్క చేయకుండా ఎముకలు కొరికే చలిలో 2016 నవంబర్‌ 9న తన 97వ ఏట ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేయడాన్ని బట్టి ఆయన సాహస వీరుడు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ శిఖరం. అంతే కాదు తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. దేశ స్వాతంత్రోద్యమంతో పాటు నిజం వ్యతిరేక తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడు. ఉద్యమమే ఊపిరిగా 90 ఏళ్లు జీవించిన బాపూజీ 1915 సెప్టెంబర్‌ 27న ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో జన్మించారు. బాపూజీ తల్లిదండ్రులు కొండ అమ్మక్క, కొండా పోశెట్టి. కొండా లక్ష్మణ్‌ బాపూజీ మూడేళ్ల ప్రాయంలో ఉండగానే తల్లి అమ్మక్క మరణించింది. బాపూజీ బాల్యం మరియు ప్రాథమిక విద్యాభ్యాసమంత ఆదిలాబాద్‌ జిల్లా, ఆసిఫాబాద్‌ ప్రాంతంలోనే జరిగింది. అప్పటి అధికార భాష అయిన ఉర్దూలో చదువుకున్న బాపూజీ చదువు మీద ఉన్న ఆసక్తితో 1937లో తన మిత్రులతో కలిసి హైదరాబాదు వచ్చి మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. చదువుతోపాటు కుస్తీ, ఫుట్‌బాల్‌ పోటీల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు.
చిన్ననాటి నుండే స్వాతంత్రోద్యమంపై ఆసక్తి పెంచుకున్న బాపూజీ 1931లో మహాత్మా గాంధీ మహారాష్ట్రలోని చాందాకు వస్తున్నారన్న విషయం తెలుసుకొని 20 మైళ్ళు కాలినడకన చాందాకు వెళ్లి బాపూజీని చూసి వచ్చిన తర్వాత ఆయనలో స్వాతంత్ర కాంక్ష మరింత పెల్లుబికింది. కారణం ఆసిఫాబాద్‌ ప్రాంతంలో రజాకార్ల ఆరాచకాలు, నిజాం ప్రభుత్వాధికారుల ఆగడాలు, దౌర్జన్యాలు. చదువుకునే వయసులోనే నాయకత్వ లక్షణాలు చాలా మెండుగా కనిపించేవి బాపూజీలో.
1940లో న్యాయవాద వృత్తి చేపట్టి యువజన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు బాపూజీ. యువతను జాగృతం చేసి వారిలో సేవాభావాన్ని పెంపొందింప చేయడమే లక్ష్యంగా యువజన సంఘాలను స్థాపింప చేశారు. 1941లో మెదక్‌ జిల్లా నిజాంపేటలో జరిగిన పద్మశాలీయుల సమావేశానికి బాపూజీ మొదటిసారిగా హాజరయ్యారు. అనంతరం షోలాపూర్‌లో జరిగిన 8వ అఖిల భారత పద్మశాలి మహాసభల్లో పాల్గొన్నారు.
1963లో హైదరాబాద్‌ సెంట్రల్‌ కో ఆపరేటివ్‌ యూనియన్‌ వజ్రోత్సవాల సందర్భంగా బాపూజీకి ‘సహకార రత్న’ బిరుదును ప్రధానం చేశారు.
రాజకీయ ప్రస్థానం: 1952లో అసిఫాబాద్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957లో నల్గొండ జిల్లా చిన్న కొండూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికయ్యారు. అయితే 1962లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైన బాపూజీ తన ఓటమికి ప్రత్యర్ధుల అక్రమాలే కారణమని తెలుసుకున్న బాపూజీ వారిపై కేసు వేసి విజయం సాధించారు.
1967లో నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన బాపూజీ కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న సమయంలో 1969లో ఎగిసిపడిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన మంత్రి పదవిని త్రుణప్రాయంగా చదివించారు. ఆ తర్వాత 1973లో పి.వి. నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇందిరాగాంధీ ఆశీస్సులతో దక్కింది. కానీ అప్పటి కేంద్ర హోంమంత్రి ఉమాశంకర్‌ దీక్షిత్‌ జోక్యం చేసుకొని బాపూజీ స్థానంలో జలగం వెంగళరావును ముఖ్యమంత్రిగా చేశారు. 1965 జూలై 29న నాటి కేంద్ర రేడియో సమాచార శాఖ మంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు స్వయంగా బాపూజీ ఇంటికి వచ్చారు. బాపూజీ ఏ స్థాయి నాయకుడో ఆ పర్యటనతో అర్థం చేసుకోవచ్చు. దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఆయన చేనేత, ఎక్సైజ్‌ మరియు లఘు పరిశ్రమల శాఖకు క్యాబినెట్‌ హోదాలో మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు మంత్రిగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్‌గా, 17 సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా కొనసాగిన ఘనత బాపూజీది. స్వాతంత్రోద్యమానికి ముందు స్వాతంత్య్రానంతరం ప్రజల కోసమే తన జీవితాన్ని ధారపోసిన నేత బాపూజీ.
1956లో పెద్దమనుషుల బలవంతపు ఒప్పందం ద్వారా తాత్కాలికంగా ఆగిన ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమం మళ్లీ 1967లో యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని అప్పటి వైస్‌ ఛాన్స్‌లర్‌ డి.ఎస్‌.రెడ్డికి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి జరిగిన వివాదంలో నుండి పుట్టింది మలిదశ తెలంగాణ ఉద్యమం. 1967లో మొదలైన మలిదశ ఉద్యమ వివిధ కారణాలవల్ల 1969 నాటికి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆ కారణం చేతనే అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఉన్న బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ‘‘తెలంగాణ ప్రజా సమితి’’ తరపున పోరాడడానికి ముందుకూరికారు.
ఇక మూడవ దశ ఉద్యమానికి అంకురార్పణ 1997లో జరిగింది. బాపూజీ స్థాపించిన తెలంగాణ ప్రజా పార్టీ దానికి కేంద్ర బిందువు అయినా అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ వెలుగులోకి రాలేకపోయింది. మూడు తరాల ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన కొండ లక్ష్మణ్‌ బాపూజీ 2012 సెప్టెంబర్‌ 21న మరణించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking