రోడ్డెక్కిన పారిశుద్ధ్య కార్మికులు
బహదూర్ పల్లిలో పారిశుద్ధ్య
కార్మికులపై దాడి
కార్మికుడు దుడ్డు సురేందర్, మరో ఇద్దరు మహిళలపై దాడి చేసిన టీ టైం యజమాని శ్యాం అతని కుమారులు
చికిత్స నిమిత్తం కార్మికులను బహదూర్ పల్లిలో ఎస్ వి ఆసుపత్రికి తరలింపు
మేడ్చల్, అక్షిత బ్యూరో :
దుండిగల్ పురపాలక పరిధి బహదూర్ పల్లిలో విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు పారిశుధ్య కార్మికులను ఓ టీ టైం యజమాని అతని కుమారులు విచక్షణా రహితంగా దాడి చేయగా ఓ కార్మికునికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో ఇద్దరు మహిళా కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే స్థానికంగా ఉండే ఎస్ వి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ కార్మికులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. కాగా కార్మికులపై దాడి జరిగిన సంఘటనను తెలుసుకున్న మున్సిపల్ కార్మికులు బహదూరపల్లిలో చాయ్ కేఫీ టీ టైం ముందు సిఐటియు నాయకుడు బొడిగే లింగ స్వామి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.

స్థానికుల సమాచారం ప్రకారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూరపల్లిలో మున్సిపల్ కార్మికులు దుడ్డు సురేందర్, దుడ్డు బాలమని, కొమ్ము వెంకటమ్మ రోజు లాగే శనివారం ఉదయం ఆరు గంటలకు బహదూరపల్లి వీధుల్లో చెత్త ఊడ్చే పనిలో పడ్డారు. చాయ్ కేఫ్ శ్యాం టీ స్టాల్ దగ్గరకు రాగానే టీ స్టాల్ ముందు రోడ్డుపై చెత్త వేస్తుండగా మున్సిపాల్ కార్మికుడు దుడ్డు సురేందర్ టీ స్టాల్ యజమాని శ్యాంను వారించాడు. మాటా మాటా పెరగడంతో అదుపుతప్పిన శ్యాం అతని కుమారులు మొత్తం నలుగురు కలసి మున్సిపల్ కార్మికుడు దుడ్డు సురేందర్ ను విచక్షణా రహితంగా దాడి చేశారు. అడ్డు తగిలిన మరో ఇద్దరు మహిళా కార్మికులు దుడ్డు బాలమని, కొమ్ము వెంకటమ్మలపైన దాడికి దిగాడు. అక్కడే ఉన్న తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భరత్ కుమార్, తాజా మాజీ వైస్ చైర్మన్ పద్మారావులకు కార్మికులకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే స్థానికంగా ఉన్న ఎస్ వి ఆసుపత్రికి తరలించారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
మున్సిపల్ కార్మికులపై దాడి సంఘటనను తెలుసుకున్న కమీషనర్ వెంకటేశ్వర్ నాయక్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులపై దాడి చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మెరుగైన చికిచ్చ అందిస్తున్నామని, ఆసుపత్రి ఖర్చు తామే బరిస్తున్నామన్నారు. కార్మికులు దుడ్డు సురేందర్, దుడ్డు బాలమని, కొమ్ము వెంకటమ్మలకు తీవ్రగాయాలు అయ్యాయన్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. నిందితుడు శ్యాంపై గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ లో పలు ఫిర్యాదులు నమోదైనట్లు సమాచారం. ఫిర్యాదు స్వీకరించిన పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పి సతీష్ తెలిపాడు.
చాయ్ కేఫీ టీ టైం ముందు పారిశుధ్య కార్మికుల ధర్నా..
విధి నిర్వహణలో ఉన్న కార్ముకులపై దాడి జరగడంతో సమాచారం అందుకున్న మున్సిపల్ కార్మికులు సిఐటియు నాయకులు బొడిగే లింగ స్వామి ఆధ్వర్యంలో టీ టైం ముందు ధర్నా నిర్వహించారు. దాడి చేసిన టీ టైం యజమాని అతని అనుచరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న స్థానిక నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి, ఓబిసి దుండిగల్ మున్సిపాలిటీ కుమార్ యాదవ్, సాదు యాదవ్, గ్రంధాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మైసి గారి శ్రీనివాస్, పిట్ల శ్రీనివాస్, కార్మికులకు మద్దతుగా నిలచి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.