పదేళ్లు కల్లలాయే
నేడు నిజమాయే
అప్పడు ఇప్పుడు కాంగ్రెస్
పాలనలోనే గ్రూప్-1 నియామకాలు
స్టాంప్స్ రిజిస్ట్రేషన్
శాఖకు వన్నె తేవాలి
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కన్న కలలు గడచిన పది సంవత్సరాలలో కలలుగానే మిగిలాయని
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వారి కలలను నిజం చేస్తోందని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ -1 నియామకాల్లో ఎంపికై స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో జిల్లా రిజిస్ట్రార్‌లుగా నియమితులైన పలువురు అభ్యర్థులు మంగళవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు.
ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని, ఈ కీలక సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న అభ్యర్థులపై గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో 2011 లో గ్రూప్ -1 కు నోటిఫికేషన్ జారీ చేయగా, 2018 లో భర్తీ ప్రక్రియ పూర్తయిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ చేస్తే మీరేంది భర్తీ చేసేది, తెలంగాణ సాధించుకున్న తర్వాత స్వరాష్ట్రంలో మా ఉద్యోగాలను మేమే భర్తీ చేసుకుంటామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తని ఆ పార్టీ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం శోచనీయమన్నారు
ఉద్యోగాలు ఇవ్వాలన్నా , పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 పోస్టులు భర్తీ చేసి ప్రజా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి నియామకాలు జరిపిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రమం తప్పకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ -1 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసేవారని ఏ ఉద్యోగిని అడిగినా ఫలాన సంవత్సరంలో నియమితులయ్యామని చెప్పేవారు. కానీ దురదృష్టవశాత్తూ గడచిన పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టిజిపిఎస్సీని పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఈ దశలో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం టిజిపిఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు జారీ చేయడమేకాకుండా ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తోందని అన్నారు. ఏడాదిన్నరలోనే దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. ఇది చూసి ఓర్వలేని కొంతమంది ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వం స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖను ఒక ఆదాయ వనరుగానే చూసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రజల సమయాన్ని ఆదా చేసేలా
స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చామని కార్పోరేట్‌కు ధీటుగా అత్యంత ఆధునిక వసతులతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకొని అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీతో నిబద్దతతో విధులు నిర్వహించి ప్రభుత్వ పేరు ప్రతిష్ఠలను పెంచాలని ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన జిల్లా రిజిస్ట్రార్‌లకు మంత్రి సూచించారు.