కరివెనలో తట్టెడు
మట్టి తీయలే !
సొంత జిల్లాకు సీఎం
తీరని అన్యాయం !!
పాలమూరు-రంగారెడ్డి పెండింగ్ పనులు పూర్తి చేయాలి
ఆల్మట్టి ఎత్తు పెంచితే
మాట్లాడట్లే
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :
కరివెన రిజర్వాయర్ లో తట్టెడు మట్టి తీయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కరివెన రిజర్వాయర్‌ను సందర్శించి మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం చేస్తున్నారని.. జిల్లా ప్రజలు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని క్షమించరని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లను సుప్రీంకోర్టు సస్పెన్షన్‌లో పెట్టినా.. రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణమని పేర్కొన్నారు. సీడ్ల్యూసీ ప్రాజెక్ట్‌ల పర్మిషన్ ఆపేసి లిస్ట్ లోంచి తీసేసిందని.. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదన్నారు.

వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. కృష్ణానది, మహబూబ్ నగర్ జిల్లాకు నీరిచ్చే వరప్రదాయని అని కొనియాడారు. అలాంటి కృష్ణానదిలో తెలంగాణ సిద్దించిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవటం జరిగిందని చెప్పారు. కేసీఆర్ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తి అయ్యాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా సరే ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఉదండాపూర్, కరివెనలో ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్లపూర్ నుంచి ఎదెల వరకు వచ్చే టన్నెల్ పనులను చేయటం లేదన్నారు. ఒక పక్క ఉన్న నీళ్లను వాడుకోవటం లేదని.. మరో పక్క ఆల్మట్టి ఎత్తు పెంచితే మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. తక్షణమే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మీనాంభరం శ్రీ పరుషవేదీశ్వర
స్వామి ఆలయ దర్శన
జడ్చర్ల మండలంలోని మీనాంభరం శ్రీ పరుషవేదీశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకుంటే కోటి ఆలయాలను దర్శించుకున్న పుణ్యం వస్తుందని చెబుతారని అలాంటి ఆలయాన్ని దర్శించుకోవటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కవిత అన్నారు. స్వామి వారిని తాకితే బంగారమవుతారని అంటారని…తెలంగాణ కూడా బంగారం మాయం కావాలని అన్నారు. ఆలయాభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ప్రత్యేకంగా స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.