ప్రజల ప్రాణ భద్రతే.. పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం

నాగారం వర్ధమానుకోట ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్స్

ప్రజల ప్రాణ భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం

అతివేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం

ఒక్క చిన్న నిర్లక్ష్యం కుటుంబాలను అంధకారంలోకి నెట్టేస్తుంది

ప్రాణ నష్టం నివారించేందుకే ముందస్తు భద్రత చర్యలు

నాగారం ఎస్ఐ ఎస్. చిరంజీవి

నాగారం, అక్షిత న్యూస్ :- రోడ్డు ప్రమాదాల నిర్మూలన దిశగా నాగారం పోలీసుల ముందడుగు – నాగారం, వర్ధమానుకోట రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు. ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా నాగారం మండలంలో రోడ్డు భద్రత చర్యలను నాగారం పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. గత కొంతకాలంగా నాగారం నుంచి వర్ధమానుకోట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై అధిక వేగంతో వాహనాలు దూసుకెళ్ళడం వల్ల చిన్నపాటి ప్రమాదాలతో పాటు ప్రాణ నష్టం కలిగే ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, వాటిని పూర్తిగా నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని నాగారం ఎస్సై ఎస్. చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఎస్సై ఎస్. చిరంజీవి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అనేవి అనివార్యమైనవి కావు, వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పాటనే ప్రమాదాల నివారణకు అసలైన పరిష్కారం అని ప్రజల ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతోనే స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా నిదానంగా ప్రయాణిస్తే ప్రమాదాలను పూర్తిగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అని ఒక్క చిన్న నిర్లక్ష్యం కుటుంబాలను అంధకారంలోకి నెట్టేస్తుందని బాధను వ్యక్తం చేశారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ముందస్తు చర్యలు చేపడుతున్నామని అన్నారు. వాన దారులు అందరూ స్పీడ్ బ్రేకర్ల వద్ద నిదానంగా వెళ్లి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలీసు శాఖ కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, ప్రజల భద్రత కోసం అవసరమైన చోట ప్రివెంటివ్ మేజర్స్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజల సహకారం లేకుండా ప్రమాదాల నివారణ సాధ్యం కాదని తెలిపారు. అలాగే రహదారులపై నిర్లక్ష్యం, అతివేగమే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతుందని, ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పోలీసు శాఖ చేపడుతున్న ఈ ముందస్తు భద్రత చర్యలను ప్రజలు సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాల నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking