కుత్బుల్లాపూర్‌ డివిజన్ లో కూన గౌరీష్ పార్టీ మార్పు

*కుత్బుల్లాపూర్‌ డివిజన్ లో కూన గౌరీష్ పార్టీ మార్పు… బీఆర్‌ఎస్ శిబిరంలో సంబరాలు*

అక్షిత న్యూస్ / గాజులరామరం : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ గౌరీష్ తన భార్యతో పాటు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానిక రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. అయితే, ఆయన పార్టీ మార్పుపై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరపడం విశేషం.
జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని పద్మనగర్ ప్రాంతంలో బీఆర్‌ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచిపెట్టి, టపాకాయలు కాల్చి ఆనందం వ్యక్తం చేశాయి. కూన గౌరీష్ పార్టీని వీడడం తమకు ఎలాంటి నష్టం కాదని, ఇది పార్టీకి మేలు చేసే పరిణామమని నాయకులు పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా పార్టీ పదవులు పొందిన గౌరీష్ ద్వితీయ శ్రేణి నాయకులకు అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని వారు ఆరోపించారు.

కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో లేకపోయారని, డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపట్టడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. అక్రమ నిర్మాణాల వద్ద వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. ఇలాంటి నాయకుడు పార్టీని వీడటం వల్ల బీఆర్‌ఎస్‌కు నష్టం కంటే లాభమే జరుగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలోని 24 డివిజన్లలో అత్యధిక కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుని సత్తా చాటుతామని నినాదాలు చేశారు. స్థానిక స్థాయిలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు రాబోయే ఎన్నికలకు దిశానిర్దేశం చేసే సూచనలుగా భావిస్తున్నారు. గౌరీష్ పార్టీ మార్పు ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం నియోజకవర్గ బీఆర్‌ఎస్ శిబిరంలో మాత్రం ఉత్సాహం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking