కాపురానికి కులాలు అడ్డు ఉన్నాయని దంపతుల ఆత్మహత్య
చేర్యాల, అక్షిత ప్రతినిధి: కులాలు వేరైనా ప్రేమ వివాహం చేసుకున్నా నూతన భార్యా భర్తలు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముత్యాల గ్రామంలో చోటుచేసుకుంది. చేర్యాల మండలం ముత్యాల గ్రామానికి చెందిన అనుముల రాకేష్, అదే గ్రామానికి చెందిన తరిగొప్పుల హారిక ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు అంగీకరించరని భయంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కులాలు వేరు కావడం, వివాహ విషయం ప్రియుడి తల్లిదండ్రులకు తెలియడంతో అబ్బాయిని వారి ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు ఎక్కడ దూరం అవుతాడో అనే బాధతో హారిక ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కొద్దిరోజులకు హారిక కోలుకున్న అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ప్రియుడు తల్లిదండ్రులను పిలిపించి స్థానిక పోలీసులు మాట్లాడారు. తల్లిదండ్రులు కొద్ది రోజుల సమయం కావాలని పెద్దల సమక్షంలో పెళ్లి చేస్తామని మాట ఇవ్వడంతో ఇరువురి కుటుంబీకులు అంగీకరించారు. ఈ ఒప్పందం జరిగిన కొద్ది రోజుల్లో నే కుటుంబంలో జరిగిన గొడవలతో ఇటీవల రాకేష్ రెడ్డి పురుగుల మందు తాగి మూడు రోజుల క్రితం మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక హారిక గురువారం నర్మేట మండలంలోని అమ్మమ్మ వారి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వివాహం చేసుకొని మొన్న భర్త, ఈరోజు భార్య మరణించడంతో ముత్యాల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయంపై స్థానిక ఎస్సై అపూర్వ రెడ్డి సంప్రదించగా అబ్బాయి అమ్మాయి రాష్ట్రంగా పెళ్లి చేసుకున్న మాట వాస్తవమని, అనంతరం ఇరువురి కుటుంబాల సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని, జరిగిన విషయంపై దర్యాప్తు కొనసాగుతుందని ఎస్సై తెలిపారు.