వ్యవసాయ సంక్షోభంపై సమరశీల ఉద్యమాలకు పిలుపు

వ్యవసాయ సంక్షోభంపై సమరశీల ఉద్యమాలకు పిలుపు

నల్లగొండ జిల్లా రైతాంగానికి రైతు సంఘం నేతల పిలుపు

నల్గొండ అక్షిత ప్రతినిధి 

నల్లగొండలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సమరశీల రైతాంగ ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్‌లో జిల్లా రైతు సంఘం 24వ మహాసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలకు చట్టబద్ధమైన మద్దతు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు.రాష్ట్రంలో యాప్‌ల ద్వారా పంటల కొనుగోలు, యూరియా పంపిణీ వంటి విధానాలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రైతుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు అప్పుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, బ్యాంకుల వేధింపులు పెరిగాయని తెలిపారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాల పంపిణీలో జాప్యం జరుగుతుండడంతో అటవీ అధికారుల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమాల అనుభవాలను, ప్రస్తుత రాజకీయ-ఆర్థిక పరిస్థితులను మహాసభలో చర్చించారు. గత మూడేళ్ల పోరాటాలను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు.నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తుల చొరబాటును అరికట్టాలని, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రబీ సీజన్‌లో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు చేయాలని కోరారు.మహాసభల సందర్భంగా సంఘం జెండాను రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి, జిల్లా నాయకులు వి. వెంకటేశ్వర్లు, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, దేవిరెడ్డి అశోక్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, చలకని మల్లయ్య, కత్తి శ్రీనివాస్ రెడ్డి, అయితరాజు నరసింహ, మారయ్య, ముత్తిలింగం తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking