జిల్లాలో ఇసుక విక్రయాల్లో పారదర్శకతకు నూతన దిశ – ‘మన ఇసుక వాహనం’ యాప్ ప్రారంభం
కలెక్టర్ అభిలాష అభినవ్ ఆవిష్కరణ – యాప్ ద్వారానే ఇసుక విక్రయాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు
నిర్మల్ అక్షిత బ్యూరో:–
జిల్లాలో ఇసుక సరఫరా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. ‘మన ఇసుక వాహనం (MANA ISUKA VAHANAM)’ అనే డిజిటల్ యాప్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారికంగా ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఇకపై ఇసుక విక్రయాలు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు మరియు గృహనిర్మాణ యజమానులు మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వంనుంచి ఇసుకను పొందేలా ఈ యాప్ రూపకల్పన చేయబడిందన్నారు. యాప్ ద్వారా రుసుము చెల్లించిన వారికి మాత్రమే ఇసుక సరఫరా చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఇసుక త్రవ్వకాలు, రవాణా మరియు విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సమయానికి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఇసుకను సులభంగా బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్ లేదా లారీ ద్వారా సరఫరా ఎంపిక చేసుకోవచ్చు. బుకింగ్ అనంతరం వాహనం లైవ్ ట్రాకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన స్థిర ధరలకే ఇసుక అందించబడుతుండటంతో అదనపు ఛార్జీల భారం ఉండదు.ఈ విధానం ద్వారా అక్రమ ఇసుక దందాలకు చెక్ పడటంతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గృహనిర్మాణ యజమానులు, కాంట్రాక్టర్లు ఈ సేవ ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఏడి మైన్స్ హరి ప్రసాద్, తహసిల్దార్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

