కలెక్టర్ సాబ్ ..కొత్తగూడెం ఏజెన్సీలో 1/70 చట్టం బ్రతికే ఉందా?
ఏడాదిగా ఆర్‌డీఓ కోర్టులో కదలని ఎల్టీఆర్ ఫైళ్లు!
అగ్రవర్ణాల కబ్జాలో వందల ఎకరాల ఆదివాసీ భూములు
కొత్తగూడెం /అక్షిత బ్యూరో:
భారత రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన రక్షణ కవచం ఐదవ షెడ్యూల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అపహాస్యమవుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమి బదిలీని నిరోధించే 1/70 (ఎల్టీఆర్) చట్టం కేవలం కాగితాలకే పరిమితమైందా అన్న అనుమానం కలుగుతోంది. టేకులపల్లి మండలంలోని పలు రెవెన్యూ గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోని రెవెన్యూ యంత్రాంగం చిత్తశుద్ధిని నిలదీస్తున్నాయి.
ఏడాది గడిచినా వీడని నోటీసుల పర్వం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొప్పురాయి రెవెన్యూ గ్రామ పరిధిలో సుమారు 90 ఎకరాల గిరిజన భూమిని ఆంధ్ర ప్రాంతం నుండి వలస వచ్చిన రెండు అగ్రవర్ణ కుటుంబాలకు చెందిన 10 మంది వ్యక్తులు గిరిజన చట్టాలను ఉల్లంఘించి పట్టాలు చేసుకున్నారు. దీనిపై నిరుపేద గిరిజనులు గతేడాది కొత్తగూడెం ఆర్‌డీఓ కు ఎల్టీఆర్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం తక్షణమే విచారణ జరిపి భూములను గిరిజనులకు అప్పగించాల్సి ఉండగా, ఏడాది కాలంగా అధికారులు కేవలం నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ గిరిజన చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. అధికారులు నోటీసులతో కాలయాపన చేస్తుంటే అక్రమార్కుల ఆగడాలు మరింత ఊపందుకుంటున్నాయి. ఎల్టీఆర్ నమోదైన 90 ఎకరాలే కాకుండా, అదనంగా మరో వంద ఎకరాల భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేస్తున్నారు. చివరకు గిరిజనులు అడవికి వెళ్లే దారిని సైతం మూసివేసి, ఆర్టికల్ 21 ప్రసాదించిన జీవన హక్కును కాలరాస్తున్నారు. దీనిపై స్థానిక తహసీల్దార్‌కు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అగ్రవర్ణాల ఒత్తిళ్లకు తలొగ్గడమేనని స్పష్టమవుతోంది. ఇదే మండలంలోని గంగారం రెవెన్యూ పరిధిలో మరో గిరిజనేతరుడు చట్ట విరుద్ధంగా సంపాదించిన 80 ఎకరాలపై దాఖలైన ఎల్టీఆర్ ఫిర్యాదు కూడా కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో దుమ్ము పట్టి పోతుంది. బోడు రెవెన్యూ గ్రామానికి చెందిన మరో కేసులో అగ్రవర్ణ గిరిజనేతరులు నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలపై కూడా ఎల్టీఆర్ కేసు నమోదు చేసి ఏడాది గడిచినా ఇంకా పరిష్కరించలేదు. ఇదే అదనుగా అగ్రవర్ణ గిరిజనేతరులు ఎల్టీఆర్ ఫిర్యాదు చేసిన ఆదివాసి నాయకురాలిని బెదిరింపులకు గురి చేసారని, దీనిపై ఆర్డీఓ కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సమాచారం. జిల్లా కలెక్టర్ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఇలాంటి భూదందాలు వెలుగుచూడకపోవడం గమనార్హం.
ఎల్టీఆర్ చట్టం ఏం చెప్తోంది?
1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుడి నుండి గిరిజనేతరుడికి భూమి బదిలీ కావడం పూర్తిగా చట్టవిరుద్ధం. చట్టంలోని సెక్షన్ 3(1)(ఏ) (బి) ల ప్రకారం గిరిజనేతరులకు భూమి బదిలీ నిషేధించబడుతుంది.అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుడి ఆధీనంలో భూమి ఉంటే, అది అక్రమంగా బదిలీ అయినట్లుగానే చట్టం ప్రాథమికంగా భావిస్తుంది. దానిని సక్రమమని నిరూపించుకోవాల్సిన బాధ్యత సదరు గిరిజనేతరుడిదే. ఏజెన్సీ ప్రాంతంలోని భూమిని గిరిజనేతరులకు బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని 1997 లోనే సమత వర్సెస్e స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుతో స్పష్టం చేసింది. వి.సోములమ్మ వర్సెస్ డిప్యూటీ కలెక్టర్ (1993) కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ కూడా గిరిజన భూముల రక్షణే ప్రభుత్వానికి పరమావధి కావాలని నొక్కి చెప్పింది. ఇన్ని చట్టాలు, తీర్పులు ఉన్నా కొత్తగూడెం ఆర్‌డీఓ కోర్టులో ఎల్టీఆర్ ఫైళ్లు ఎందుకు ముందుకు సాగడం లేదని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
కలెక్టర్ సాబ్ … మీరైనా జర స్పందించండి!
తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఉత్తర్వు జి.ఓ.ఎంఎస్.నెం.4 తేదీ 12.01.2021, చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ (సి.సి.ఎల్.ఏ) సర్క్యులర్ 1/2021 ప్రకారం, రెవెన్యూ కోర్టులు , స్పెషల్ ట్రిబ్యునళ్లు ఎల్టీఆర్ కేసులను 30 నుండి 120 రోజుల వ్యవధిలోపల కచ్చితంగా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాలు గిరిజనుల చట్టబద్ధమైన హక్కుల రక్షణ కోసం జారీ చేయబడ్డాయి. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులను కాపాడాల్సిన బాధ్యత జిల్లా రెవెన్యూ యంత్రాగం బాస్ అయిన జిల్లా కలెక్టర్ పైనే ఉంది. కాబట్టి ఇప్పటికైనా అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, టేకులపల్లి మండలంలోని పెండింగ్ ఎల్టీఆర్ కేసులను యుద్ధప్రతిపాదికన పరిష్కరించి ఆదివాసీలకు న్యాయం చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.