నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసనకు పిలుపు.
.TGEJAC
యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం (ఏప్రిల్ 17) మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో భోజన విరామ సమయంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించారు. జేఏసీ జిల్లా చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ భగత్ సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, 2023 నుంచి అమలు కావాల్సిన రెండో పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రూ.13 వేల కోట్ల బిల్లులను విడుదల చేయాలని, ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ (EHS) సౌకర్యాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. కొత్త పెన్షన్ విధానం (CPS) రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 17న భోజన విరామ సమయంలో నిర్వహించే ధర్నాలో మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు పాల్గొనాలని సమావేశంలో తీర్మానించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భగత్, పీఆర్‌టీయూ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు యాదయ్య, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, ట్రెస్సా అధ్యక్షుడు కృష్ణ, టీఎన్జీవో నాయకులు శ్రీకాంత్, శశికాంత్, డీటీఎఫ్ నాయకులు లక్ష్మీనరసింహ, శైలజ, లింగయ్య, దుర్గాప్రసాద్, యూఐఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.