యువర్ అండర్ అరెస్ట్!
సీనియర్ జర్నలిస్టుకు డిజిటల్ అరెస్టు బెదిరింపు
తిరగబడటంతో తోకముడిచిన స్కామర్లు
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి
నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఈ డిజిటల్ అరెస్టులను స్వయంగా సుప్రీంకోర్టు సీరియస్ అంశంగా పరిగణిస్తున్నా కేటుగాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో ఓ సీనియర్ జర్నలిస్టును బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఇది స్కామర్ల పనేనని గ్రహించిన సదరు జర్నలిస్ట్ వారిపై ఎదురు తిరగబడటంతో తోకముడిచారు. ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో పనిచేస్తున్న సదరు జర్నలిస్టుకు ఆదివారం 09983840498 నంబర్ నుండి రాజ్వీర్ ఎస్ఎహ్హ్వ అంటూ వీడియో కాల్ వచ్చింది. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరించాడు.
వాట్సాప్ ద్వారా బెదిరింపులు..
వెంటనే అప్రమత్తమైన సదరు జర్నలిస్టు ఆ స్కామర్లపై సామర్లపై ఎదురు తిరిగి మాట్లాడటంతో కాల్ కట్ చేసేశారు. అనంతరం ఆ స్కామర్లు వెంటనే వాట్సాప్ ద్వారా నేను నీపై కేసు నమోదు చేస్తాను. మీ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు నీ కేసు ఫైల్ను పంపిస్తాను. వారు 24 గంటల్లోపు నిన్ను అరెస్ట్ చేస్తారు. అని బెదిరింపు మెసేజ్ పంపించారు. అలాగే వీగురించి అన్ని న్యూస్ చానళ్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని నీ లొకేషన్ ట్రేస్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపులన్నీ కేటుగాళ్లవేనని గ్రహించిన సదరు జర్నలిస్టు వెంటనే ఆ నంబర్ను బ్లాక్ చేశాడు. ప్రస్తుతం నగరంలో సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, బిజినెస్ మెట్లను టార్గెట్ గా చేసుకుని ఇలాంటి డిజిటల్ అరెస్టుల పేరుతో నిత్యం అనేక మంది బాధితులుగా మారుతున్న వేళ జర్నలిస్టు చూపిన సమయస్ఫూర్తి ఇతరులకు ఆదర్శంగా మారింది. సైబర్ నేరాల పట్ల అనుమానం, బెదిరింపులు వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేసి సహాయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.