మెడికల్ విద్యార్థుల ఆశలు ఆవిరి.. NEET (UG)-2026 పరీక్ష రద్దు
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్లో పేపర్ లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పరీక్ష పారదర్శకతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.కాగా, మే 3న నిర్వహించిన నీట్ పరీక్షకు సంబంధించి ‘గెస్ పేపర్’ (Guess Paper) లీక్ అయిందనే వార్తలు రాజస్థాన్లో కలకలం రేపాయి. దర్యాప్తు సంస్థల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షను రద్దు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది. ఈ పేపర్ లీక్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవడానికి కేసును సీబీఐ (CBI)కి అప్పగించారు. రద్దు చేసిన పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహించనున్నారు. ఇక పరీక్ష కొత్త తేదీలను ఎన్టీఏ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించనుంది. అయితే, రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ తెలిపింది. పాత హాల్టికెట్లు, కొత్త అడ్మిట్ కార్డుల ద్వారా ఎలాంటి అదనపు రుసుము లేకుండా అభ్యర్థులు పరీక్షకు హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు.
విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన..
పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులు వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలనే అనుసరించాలని సూచించింది.