వినయాల వెనుక “వాయిదాల ఆట”!

వినయాల వెనుక “వాయిదాల ఆట”!

ఆర్టీఐ చట్టానికి ‘దుమ్ము’ పట్టిస్తున్న దుమ్ముగూడెం రెవెన్యూ అధికారులు!

కమిషనర్ ముందు వినయాలు..

సమాచారం ఇవ్వడానికి వాయిదాలు

కమిషనర్ ఆదేశాలకే దిక్కులేదు.. సామాన్యుడికి సమాచారం ఎక్కడ?

రెండేళ్లుగా తిరుగుతున్నా అందని ప్రభుత్వ భూముల వివరాలు.. ఏజెన్సీ భూకుంభకోణమే కారణమా?

భద్రాద్రి కొత్తగూడెం/ అక్షిత ప్రతినిధి:

చట్టాలు సామాన్యుడికి రక్షణగా ఉండాలి.. కానీ దుమ్ముగూడెం మండల తహసీల్దార్ కార్యాలయంలో చట్టాలు అధికారుల ఇష్టారాజ్యానికి బలైపోతున్నాయి. సమాచార హక్కు చట్టం  కింద దరఖాస్తు చేసుకుంటే రెండేళ్లు గడిచినా సమాచారం ఇవ్వకుండా బాధితుడిని ముప్పుతిప్పలు పెడుతున్న వైనం జిల్లా రెవెన్యూ యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. స్వయంగా రాష్ట్ర సమాచార కమిషనర్‌ ఆదేశించినా సదరు అధికారులు బేఖాతరు చేయడం ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చాటి చెబుతోంది. దుమ్ముగూడెం మండలంలోని ప్రభుత్వ భూముల వివరాల కోసం 2023లో గంగాధర కిశోర్ కుమార్ అనే ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఇంచార్జ్ తహసీల్దార్‌గా ఉన్న మణిధర్ దుమ్ముగూడెం మండలంలోని పలు రెవెన్యూ గ్రామాల ప్రభుత్వ భూముల సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేశారు. బాధితుడు భద్రాచలం సబ్ కలెక్టరుకు మొదటి అప్పీలు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి విధిలేక 2024లో రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.

కమిషనర్ ముందు వంగి వంగి దండాలు… విచారణ తరువాత కుంటి సాకులు

2025 నవంబర్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీలో జరిగిన విచారణలో రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి ముందు విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత తహసీల్దార్ ఎం.అశోక్ తరఫున నాయబ్ తహసీల్దార్ భరణి బాబు హాజరయ్యారు. కమిషనర్ జరిమానా విధిస్తారనే భయంతో, విచారణకు ముందే దరఖాస్తుదారుడి కాళ్లు పట్టుకున్నంత పనిచేశారు. “రెండు రోజుల్లో సమాచారం ఇస్తాం.. కమిషనర్‌కు ఫిర్యాదు చేయొద్దు” అని బ్రతిమిలాడి, దరఖాస్తుదారుడిని ఒప్పించారు. దీనితో కమిషనర్ కూడా మానవీయ కోణంలో ఆలోచించి, రెండు వారాల గడువు ఇచ్చారు. కానీ, తీరా కమిషన్ గడువు ముగిసినా నేటికీ సమాచారం అందలేదు. గత ఏడాది నవంబర్ నుండి ఈ సంవత్సరం మే నెల వచ్చినా ఇంకా సమాచారం ఇవ్వడానికి కుంటి సాకులు వెదుకుతున్నారు దుమ్ముగూడెం రెవెన్యూ అధికారులు. పదిహేను రోజులో సమాచారం ఇవ్వాలని కమిషనర్ ఆదేశిస్తే ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ భూముల సమాచారం ఇవ్వని అధికారుల మొండి వైఖరి ఆశ్చర్యపరుస్తోంది. అంతే కాకుండా గత రెండేళ్ల కాలంలో పని చేసిన తహసీల్దార్లు మంజూరు చేసిన పట్టదారు పాసు పుస్తకాల వివరాల కోసం సమాచార కమీషనర్ ఆదేశాల తర్వాత ఈ ఏడాది ప్రథమాంకంలో పెట్టిన మరొక సమాచార దరఖాస్తుకు కూడా సదరు రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

ఒకరిపై ఒకరు నెపం.. ఏమిటి ఆ ‘భూ’ రహస్యం?

ప్రస్తుతం దుమ్ముగూడెం మండల రెవెన్యూ కార్యాలతానికి సమాచారం కోసం వెళితే తహసీల్దార్ ఎం.అశోక్, నాయబ్ తహసీల్దార్ భరణి బాబు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధితుడిని కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. దరఖాస్తు సమయం నాటి పీఐఓ మణిధర్ ఇప్పటికీ తెర వెనుక ఉండి సమాచారం రాకుండా అడ్డుకుంటున్నారనే బలమైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దుమ్ముగూడెం ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ భూములను అక్రమంగా గిరిజనేతరులకు కట్టబెట్టారని, ఆ వివరాలు బయటపడితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందనే భయంతోనే అధికారులు ఈ స్థాయిలో సమాచారాన్ని తొక్కిపెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ రెవెన్యూ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర సమాచార కమిషనర్ ఆదేశాలనే గాలికొదిలేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీ భూములపై ఉన్న ఆరోపణల నిజానిజాలను బయటపెట్టి, దరఖాస్తుదారుడికి వెంటనే సమాచారం అందజేయలేదంటే చట్టాలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking