మానవ హక్కుల ఉద్యమాలకు దిక్సూచి పి. సుబ్బారావు
ప్రజా హక్కుల పరిరక్షణకు జీవితాంతం అంకితభావంతో కృషి
మిర్యాలగూడలో ఘనంగా సంస్మరణ సభ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన ప్రముఖ ప్రజాహక్కుల ఉద్యమకారుడు, విద్యావేత్త, సామాజిక చైతన్యవేత్త పి. సుబ్బారావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
వ్యక్తిగత జీవితాన్ని ప్రజల సంక్షేమానికి అంకితం చేసి, పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, గిరిజనుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా ఆయనను కొనియాడారు.మిర్యాలగూడలోని కళాభారతి ఎన్‌ఎస్‌పి క్యాంప్‌లో ఆదివారం నిర్వహించిన పి. సుబ్బారావు సంస్మరణ సభ భావోద్వేగ వాతావరణంలో జరిగింది.మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ, ప్రజాసంఘాలు, ఆయన శిష్యులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హెచ్‌ఆర్‌ఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు అక్కెనపల్లి వీరస్వామి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి తిరుపతి, రాష్ట్ర నాయకులు గోసుల మోహన్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు ప్రసంగిస్తూ పి. సుబ్బారావు జీవితం ప్రజా ఉద్యమాలకు ఒక ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే హేతువాద భావజాలం, మార్క్సిస్టు సిద్ధాంతాలు, పర్యావరణ పరిరక్షణ అంశాల పట్ల ప్రత్యేక ఆసక్తి పెంచుకున్న ఆయన, తన జీవితాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితం చేశారని గుర్తు చేశారు.అమరావతిలో జన్మించిన పి. సుబ్బారావు 1956లో మిర్యాలగూడకు వచ్చి ఉపాధ్యాయునిగా తన సేవలను ప్రారంభించారు.అనంతరం లెక్చరర్‌గా పనిచేస్తూ విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు కృషి చేశారు.1982లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా విద్యాభివృద్ధి కోసం ప్రైవేట్ పాఠశాలను స్థాపించి అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు. చైతన్య సమాఖ్య ద్వారా సామాజిక చైతన్యాన్ని విస్తరించిన ఆయన పౌరహక్కుల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రజల జీవన హక్కులను ప్రభావితం చేసే ప్రతి సమస్యపై స్పందిస్తూ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వ్యతిరేక పోరాటం, యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమాల్లో ముందుండి ప్రజల తరఫున పోరాడారని వక్తలు గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాల ఆరోగ్యం, జీవన భద్రత కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు విశేషమని వక్తలు తెలిపారు.సమాజంలో వివక్ష, అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా నిరంతరం స్వరం వినిపించారని చెప్పారు.సారా వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేశారని గుర్తుచేశారు.బూటకపు ఎన్‌కౌంటర్ల వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయడంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు ఆదర్శప్రాయమని కొనియాడారు. నిజ నిర్ధారణ కమిటీలను నిర్భయంగా నడిపిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేశారని పేర్కొన్నారు.అధికార యంత్రాంగం ఒత్తిడులకు లొంగకుండా నిజం కోసం నిలబడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.జూన్ 4, 2026న 92 ఏళ్ల వయసులో పి. సుబ్బారావు కన్నుమూసినప్పటికీ, ఆయన ఆలోచనలు, విలువలు, ప్రజా ఉద్యమాలకు అందించిన స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని వక్తలు అభిప్రాయపడ్డారు.సమాజ మార్పు కోసం నిరంతరం పోరాడిన ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ సంస్మరణ సభలో ప్రజలు, మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పొన్నారు రమేష్, ఉదయ, కిరణ్మయి, సృజన, అజయ్, నీరజలతో పాటు మనందరం కూడా మట్టి మనిషి పాండురంగారావు డాక్టర్ ఎం. రామారావు, డాక్టర్ రాజు, చెన్నూరు రంగారావు, సీడీ రవికుమార్, డాక్టర్ కృష్ణయ్య, రామయ్య సార్, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు విమల, సీఎంఎస్ రాధా, జూలూరు గౌరీశంకర్, సామాజిక ఉద్యమకారుడు సజయ , అంబటి వెంకన్న, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.