సౌత్ రాష్ట్రాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఫోకస్.. 

సౌత్ రాష్ట్రాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఫోకస్.. 

రేపు హైదరాబాద్ ధర్నా చౌక్లో భారీ సభ

అక్షిత వెబ్ డెస్క్ 

దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తూ, సరికొత్త వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఢిల్లీ, లక్నో, పూణే వంటి ప్రధాన నగరాల్లో విజయవంతంగా నిరసనలు చేపట్టిన ఈ పార్టీ, జూన్ 14వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ‘ధర్నా చౌక్’ వేదికగా భారీ శాంతియుత నిరసన సభను నిర్వహించనుంది.

 

నీట్ (NEET) లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై పోరాటం..

దేశంలో సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షల పేపర్ లీకేజీలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అవకతవకలకు నిరసనగా.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ సభ జరగనుంది. “మాకు మేక్ ఇన్ ఇండియా అడిగితే.. మీరు ‘లీక్ ఇన్ ఇండియా’ ఇచ్చారు” అనే వ్యంగ్య నినాదాలతో యువత ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతోంది.

సభకు ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ మద్దతు..

హైదరాబాద్లో జరగబోయే ఈ సభకు ప్రముఖ సామాజిక, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ హాజరై ప్రసంగించనుండటం విశేషం. నీట్ బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు నగరంలోని లా, ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఈ నిరసనలో భారీగా పాల్గొననున్నారు. విద్యావ్యవస్థలోని లోపాలతో పాటు హైదరాబాద్లో పర్యావరణ క్షీణత, కేబీఆర్ పార్క్ రక్షణ, మూసీ నది పునరుజ్జీవనం వంటి స్థానిక పౌర సమస్యలపై కూడా ఈ వేదిక ద్వారా గళం విప్పనున్నట్లు తెలంగాణ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఎవరీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక సందర్భంలో నిరుద్యోగ యువతను, సామాజిక కార్యకర్తలను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా మే 16, 2026న డిజిటల్ మీడియా వ్యూహకర్త అభిజీత్ దీప్కే ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. సోషల్ మీడియాలో ‘Voice of the Lazy & Unemployed’ (బద్దకస్తులు, నీరుద్యోగుల గొంతుక) అనే ట్యాగ్ ప్రారంభమైన ఈ అకౌంట్, కేవలం కొద్దిరోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని ప్రధాన రాజకీయ పార్టీల కంటే వేగంగా దూసుకుపోయింది. ఇది ఎన్నికల్లో పోటీ చేసే అధికారిక పార్టీ కాకపోయినప్పటికీ, యువత సమస్యలపై ఒత్తిడి తెచ్చే ఒక బలమైన ప్రజాగ్రహ వేదికగా రూపాంతరం చెందింది.హైదరాబాద్లో ఆదివారం ఉదయం జరిగే ఈ సభముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం రూట్ మ్యాప్ ఖరారు చేసింది. ఈ దక్షిణాది సభలకు యువత నుంచి ఎలాంటి స్పందన రాబోతోందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking