మామిడితోటలో మత్తు ఫ్యాక్టరీ
రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ
గుట్టురట్టు చేసిన తెలంగాణ ఈగిల్ ఫోర్స్
డ్రగ్ మాఫియా డాన్ మత్స్యగిరి అరెస్ట్
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఓ మామిడి తోటలో అత్యంత రహస్యంగా నడుస్తున్న డ్రగ్స్ ఫ్యాక్టరీని తెలంగాణ నార్కోటిక్స్ పోలీస్ విభాగం ఈగిల్ ఫోర్స్ గుట్టురట్టు చేసింది. దశాబ్దకాలంగా పోలీసుల కళ్లుగ ప్పుతూ అంతర్జాతీయ ముఠాతో కలిసి డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఓ మోస్ట్ వాంటెడ్, అతడి అనుచరుడిని అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్ తో పాటు, ఫ్యాక్టరీలో ఉన్న మరో రూ. 50 లక్షల విలువైన తయారీ యంత్రాలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈగిల్ మెరుపుదాడి
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు, ఎల్బీనగర్ క్లూస్ టీమ్తో కలిసి ఈగిల్ ఫోర్స్ బృందాలు పక్కా సమాచారంతో ఈ మెరుపుదాడి చేశాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ప్రధాన నిందితుడు కీసరి మత్స్యగిరి (38), యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన నిమ్మల నరేశ్ (38) కలిసి ఓ ఐ-20 కారులో డ్రగ్స్ తరలిస్తుండగా.. బాటసింగారం రోడ్డులోని శివాజీ మహరాజ్ విగ్రహం సమీపంలో పట్టుకు న్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మత్స్యగిరి 2015కు ముందు అబ్దుల్లాపూర్మెట్లోని ఓ రసాయన పరిశ్రమలో కెమిస్ట్ గా పని చేశాడు. డబ్బు ఆశతో గుజరాత్కు చెందిన డ్రగ్స్ తయారీదారులైన విజయ్, సంతోష్ సింగ్ ముఠాతో చేతులు కలిపి మెఫెడ్రోన్ డ్రగ్ తయారీని నేర్చుకున్నాడు. అంతేకాకుండా ఈ ముఠా 2016-17 మధ్యకాలంలో హైదరాబాద్, బరోడాల్లో పలు బంగారు దుకాణాల్లో దోపిడీలకు సైతం పాల్పడింది. తమ గుట్టు పోలీసులకు చెబుతున్నాడనే అనుమానంతో 2019లో చంద్రశేఖర్ అనే వ్యక్తిని అతికిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని కీసరలో పాతిపెట్టారు. ఈ కేసులో జైలుకు వెళ్లొచ్చిన మత్స్యగిరి.. ఆ తర్వాత స్కూల్ కరస్పాం డెంట్గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడు. కరోనా సమయంలో అందులో నష్టాలు రావడంతో మళ్లీ డ్రగ్స్ తయారీ వైపు మళ్లాడు. 2022లో రాంపల్లి, చెంగిచర్లలో డ్రగ్స్ తయారీ ల్యాబ్లు పెట్టి, డీఆర అధికారులకు పట్టుబడి, పీడీ యాక్ట్ కింద జైలుకెళ్లి వచ్చాడు. ఆ తర్వాత మత్స్యగిరి అనుచరుడు సరేష్ సాయంతో అబ్దుల్లాపూర్మెట్లోని ఓ మామిడి తోటలో రేకుల షెడ్డు వేసి.. ఫేషియల్ గ్లో పౌడర్ తయారు చేస్తున్నామని చెప్పి ఒక వాచ్మెన్ను నియమించాడు. ఐదు రోజుల పాటు రహస్యంగా ల్యాబ్లో మెఫెడ్రోన్ డ్రగ్ను తయారు చేశారు. దీన్ని విక్రయించేందుకు తరలిస్తుండగానే పోలీసులకు చిక్కారు. ఈ వ్యవహారంలో ముడిసరుకు అందించిన ప్రభాకర్, డ్రగ్ ముఠా సభ్యులు విజయ్, సంతోష్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.