నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి

నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి

– కార్పొరేషన్ ఏర్పాటు చేసి నాయి బ్రాహ్మణులకే ఇవ్వాలి

– నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల భిక్షం

రామన్నపేట అక్షిత ప్రతినిధి

నాయి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, చైర్మన్ పదవిని నాయి బ్రాహ్మణ వర్గానికే కేటాయించాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల భిక్షం డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాచీన కాలం నుంచి క్షవర వృత్తి సమాజానికి విశేష సేవలు అందిస్తోందని, ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతలో నాయి బ్రాహ్మణుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అయితే ఆధునిక కాలంలో కార్పొరేట్ సెలూన్ల విస్తరణతో సంప్రదాయ క్షవర వృత్తిదారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం క్షవర వృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందించడంతో పాటు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు పాలక మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన నాయి బ్రాహ్మణులకు పెన్షన్ మంజూరు చేయాలని, దేవాలయ కళ్యాణకట్టల్లో పనిచేస్తున్న క్షురకులను పర్మినెంట్ చేయాలని, పాఠశాలలు, హాస్టళ్లు, ఆస్పత్రులు, పోలీస్ శాఖల్లో బార్బర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మహిళలకు బ్యూటీ పార్లర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి క్షవర వృత్తిదారుడికి మెడికల్ కిట్ అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాపర్తి గణేష్, ఉపాధ్యక్షుడు దడిపెల్లి గణేష్, కోశాధికారి వావిళ్ల సంతోష్, వేముల అశోక్, రాసమల్ల శ్రీకాంత్, జంపాల మురళి, మహేష్, వేముల దశరథ, డి.నాగరాజు, జంపాల నరేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking