మహాలక్ష్మి.. మాకేది ?
రామన్నపేట మండలంలో ఆర్టీసీ బస్సు వెళ్లని గ్రామాలెన్నో
‘పల్లె వెలుగు ‘ లు రాని ప్రాంతాలెన్నో
ఉచిత ప్రయాణానికి దూరమవుతున్న మహిళలు
రోడ్లున్నా పట్టించుకోని అధికారులు
తమ గ్రామాలకు బస్సులు నడపాలని వేడుకోలు
ఆటోలను ఆశ్రయిస్తున్న గ్రామస్తులు
ఉమ్మడి నల్గొండ అక్షిత బ్యూరో
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించి నెలలు గడుస్తున్నాయి. ఈ పథకం కింద మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చార్జీలు లేకుండా జీరో టికెట్‌తో మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకానికి మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో అనేక గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. వారు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కాలినడకనో, ఆటోలు, ప్రైవేటు వాహనాల్లోనే సమీపంలోని ప్రాంతాలకు వెళ్లి ఆక్కడ నుంచి బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో మారుమూల గ్రామాల వాసులకు మహాలక్ష్మి పథకం అందని ద్రాక్షగా మిగిలింది. మండలంలో మొత్తం 24 గ్రామాలు ఉండగా అందులో 12 గ్రామాలకు బస్సు సౌకర్యం కొరవడింది. ఆర్టీసీ బస్సు అందనంత దూరంలో ఉండటంతో మహిళలు మహాలక్ష్మి పథకానికి దూరమవుతున్నారు. కొన్నింటికి రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ బస్సులు నడపలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో మహిళలకు, యువతులు, బాలికలకు ఆటో చార్జీల భారం తప్పడం లేదు.
ఆదాయం రావడం లేదని..
ఆదాయం సరిగా రావడం లేదని ఉద్ధేశంతో మండలంలో పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపడం మానేసింది. కరోనా అనంతరం పెద్ద సంఖ్యలో పల్లెలకు బస్సులను నిలిపివేసిన ఆర్టీసీ తిరిగి ఆయా రూట్లలో పునరుద్ధరించడంలో వెనుకడుగు వేసింది. ఆదాయం రావడం లేదని, రహదారి సౌకర్యం సరిగా లేదనే కారణాలతో బస్సులను పూర్తి స్థాయిలో నిలిపివేయడం వల్ల పల్లె ప్రజానీకానికి ప్రజా రవాణా వ్యవస్థ దూరమవుతోంది.
మహాలక్ష్మి’కి దూరమవుతున్నాం
గ్రామానికి బస్సు సౌకర్యం లేని కారణంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకానికి దూరమవుతున్నాము. ఉచిత బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ.. ఆటోలకు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
– బొడ్డుపల్లి సంధ్య మునిపంపుల
కరోనా నుంచి మా ఊరుకు బస్సు రావడం లేదు
కరోనా సమయం నుంచి మా ఊరుకు బస్సు రావడం లేదు. బస్సు కోసం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకానికి దూరమవుతున్నాము. బస్సు ఎక్కాలంటే.. ఆటోలో వెళ్లి బస్సు ఎక్కాల్సి వస్తుంది.
– బందెల ఎల్లమ్మ – సూరారం
ఉచిత బస్సు సౌకర్యం అందలేక పోతుంది
ఐదేళ్ల క్రితం తండాకు బస్సు వచ్చేది. కానీ.. ఇప్పుడు ఎందుకో దానిని బంద్ చేశారు. తండాకు బస్సు లేక పోవడంతో ఆటోలను ఆశ్రయిస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. కానీ.. మేము సద్వియోగం చేసుకోలేక పోతున్నాము. మా తండాకు బస్సు సౌకర్యం కల్పించాలి.
