ప్రాణాలు బలిగొనడానికి ఈ నిర్లక్ష్యమే కారణమా?
– మొన్న ‘వార్త’… నేడు ‘మట్టి’… రేపు ‘కబ్జా’…
– అయినా కదలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులు!
– బొత్తలబావి వద్ద మెయిన్ రోడ్డుపై భారీ బండరాళ్లు..
– ప్రమాదాలకు తెరలేపుతున్న ఆక్రమణలు.
– ఇద్దరి ప్రాణాలు బలిగొన్నా మారని పరిస్థితి..
– విద్యార్థుల ప్రాణాలపై పెరిగిన ఆందోళన
– ఫిర్యాదులపై స్పందన శూన్యం.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
మొన్న “వార్త”… నేడు “మట్టి”… రేపు “కబ్జా” అంటూ వరుస కథనాలతో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నా, ఆర్‌అండ్‌బీ (రోడ్లు–భవనాల శాఖ), పంచాయతీరాజ్ అధికారులు మాత్రం స్పందించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.రామన్నపేట నుంచి నీర్నేముల వెళ్లే ప్రధాన రహదారిలో, బొత్తలబావి సమీపంలోని మెయిన్ రోడ్డుపై భారీ బండరాళ్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా, మళ్లీ రహదారిని ఆక్రమిస్తూ బండరాళ్లు వేయడం ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం రహదారి పూర్తిగా ఇరుకుగా మారడంతో ఒక బస్సు ఎదురుగా వస్తే మరో వాహనం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ విద్యార్థులతో కూడిన పాఠశాల బస్సులు ఇదే మార్గంలో ప్రయాణిస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.మొన్న వార్త రాశాం… నేడు మట్టి సమస్యను చూపించాం… రేపు కబ్జాలపై రాయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరం.ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులు వెంటనే స్పందించి రహదారిపై ఉన్న బండరాళ్లు, ఆక్రమణలను తొలగించి ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


