జూలై 2న ఉప్పల్ బగాయత్‌లో జరిగే భూ పోరాటాన్ని విజయవంతం చేయాలి

జూలై 2న ఉప్పల్ బగాయత్‌లో జరిగే భూ పోరాటాన్ని విజయవంతం చేయాలి

గవినోళ్ల శ్రీనివాస్, ఎదురుగట్ల సంపత్ గౌడ్

నారాయణపేట అక్షిత ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, కళాకారులు, జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జూలై 2న హైదరాబాద్ ఉప్పల్ బగాయత్‌లో నిర్వహించనున్న భూ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భూ పోరాట ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ పిలుపునిచ్చారు. నారాయణపేటలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జి గవినోళ్ల శ్రీనివాస్, భూ పోరాట ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్, తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరే సాయిరాం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవినోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు హైదరాబాద్ ఉప్పల్ బగాయత్‌లో 250 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం తక్షణమే కేటాయించాలని కోరారు.తెలంగాణ ఉద్యమంలో విశేష సేవలు అందించిన ఉద్యమకారులు, ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కళాకారులు, తెలంగాణ ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పిన జర్నలిస్టులు, రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు ఉప్పల్ బగాయత్‌లో 250 చదరపు గజాల స్థలాన్ని కేటాయించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రభుత్వం కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులను కమిటీలో చేర్చడం సమంజసం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జూలై 2న హైదరాబాద్ ఉప్పల్ బగాయత్‌లో జరిగే భూ పోరాట కార్యక్రమానికి నారాయణపేట జిల్లా ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, యువత, మహిళలు, కళాకారులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో జేపీ శ్యామ్ ప్రసాద్, శ్యామ్, తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి కోశాధికారి వేముగంటి సురేష్,దామరగిద్ద మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పల్లెబండ నర్సిములు, భీంశాప్ప, మహేష్,విట్లాపూర్‌కు చెందిన నర్సప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking