గడ్’చంద కుంటల పరిరక్షణకు గ్రామస్తుల పట్టు
-తహసీల్దార్‌కు ఫిర్యాదు.
లోకేశ్వరం, జూలై 3 అక్షిత న్యూస్
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గడ్’చంద గ్రామ శివారులో ఉన్న చెరువులు,కుంటలు,ఇతర ప్రభుత్వ భూములను పరిరక్షించి వాటి అసలు సరిహద్దులను గుర్తించి ఆక్రమణలను అడ్డుకోవాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం లోకేశ్వరం తహసీల్దార్ సూర్యరావుకు వినతిపత్రం సమర్పించారు.గ్రామ శివారులో అంగన్‌వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న కుంట స్థలానికి సంబంధించిన వివాదంపై సమగ్ర విచారణ జరిపి,ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్వే నిర్వహించి శాశ్వత సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. కుంటల విస్తీర్ణం తగ్గకుండా పరిరక్షించడంతో పాటు రైతులకు సాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గతంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ శాఖ అధికారులు,మండల సర్వేయర్,పంచాయతీ ప్రతినిధులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పంచనామా నిర్వహించారు. ఆ వివరాల ప్రకారం తూం చెరువు (సర్వే నం.1653) 49.11 ఎకరాలు, రామకుంట/సత్యేంచందర్ (సర్వే నం.1359) 6.30 ఎకరాలు, పూరకుంట/పిలరికుంట (సర్వే నం.1369) 9.14 ఎకరాలు, నరసింహకుంట (సర్వే నం.56) 8.39 ఎకరాలు, మాలకుంట (సర్వే నం.134) 10.30 ఎకరాల విస్తీర్ణంలో నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు.గ్రామ నక్షా, పహానీ రికార్డుల ఆధారంగా కుంటలు, శ్మశాన వాటికలు, ఇతర ప్రభుత్వ భూముల హద్దులను గుర్తించి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ సమస్యపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం ప్రతులను జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్‌కు కూడా పంపినట్లు తెలిపారు.వినతి పత్రాన్ని స్వీకరించిన తహసీల్దార్ సూర్యరావు మాట్లాడుతూ,విషయంపై విచారణకు ఆదేశాలు జారీ చేశామని, విచారణ పూర్తయిన అనంతరం రెవెన్యూ రికార్డులు, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో దండ సాగర్, అంబటి సంతోష్, గాండ్ల అనిల్ కుమార్, బైరింద శ్రీనివాస్, సిరిపురం రాజు తదితరులు పాల్గొన్నారు…