కాన్‌రాయ్ స్కూల్‌ విద్యార్థుల క్రమశిక్షణపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసలు

కాన్‌రాయ్ స్కూల్‌ విద్యార్థుల క్రమశిక్షణపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసలు

-ఖమ్మంలో విద్యా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న గవర్నర్ మనోజ్ సిన్హా

ఖమ్మం/అక్షిత బ్యూరో :

ఖమ్మం నగరంలోని కార్పొరేషన్ పరిధి వెలుగుమట్లలో ఉన్న కాన్‌రాయ్ స్కూల్‌ను జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం సందర్శించారు. గవర్నర్ రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య స్కూల్ చైర్మన్ నామ తరుణ్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేరళ నుంచి ప్రత్యేకంగా వచ్చిన బ్యాండ్ వాయిద్యాల నడుమ వేద పండితులు పూర్ణకుంభంతో గవర్నర్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఏకశిల గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎం పోడ్‌కాస్ట్ స్టూడియోను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం స్కూల్ న్యూస్‌లెటర్‌ను ఆవిష్కరించి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఇన్వెస్టిచర్ సెరిమనీ (విద్యార్థి నాయకత్వ బాధ్యతల ప్రదానోత్సవం)లో భాగంగా విద్యార్థులకు బ్యాడ్జీలను అందజేశారు.జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీతలు నాగబత్తిన భాస్కర్ పెసర ప్రభాకర్ రెడ్డిలను శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ ప్రతి శనివారం నిర్వహిస్తున్న “నో బ్యాగ్ డే” కార్యక్రమాన్ని అభినందించారు. విద్యార్థుల క్రమశిక్షణ, ప్రతిభ తనను ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. స్కూల్ చైర్మన్ నామ తరుణ్ తన నాయనమ్మ నామ వరమ్మ పేరు మీద లాభాపేక్ష లేకుండా చిన్న వయస్సులోనే విద్యాసంస్థను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో శిఖరాలను అధిరోహించాలని చదువు ప్రాముఖ్యతను గుర్తించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. అనంతరం స్కూల్ ఆవరణలో వేప మొక్కను నాటారు. తదుపరి ఎన్‌ఎస్‌పీ కాలనీలో నూతనంగా నిర్మించిన శివాలయానికి చేరుకుని శివుని అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఖమ్మం రూరల్ మండలంలోని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తల్లిదండ్రులు ముత్తయ్య–వరమ్మల స్మృతి వనాన్ని సందర్శించి వారి విగ్రహాలకు నివాళులర్పించారు. వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. ఈ సందర్భంగా నామ ముత్తయ్య–వరమ్మ జీవిత విశేషాలు సమాజానికి వారు అందించిన సేవల గురించి నామ సోదరుడు సీతయ్య గవర్నర్‌కు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్ మధు, స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు నామ శ్రేయోభిలాషులు డాక్టర్లు, లాయర్లు ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు నగర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking