ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడే అవకాశం ఉంది
-వ్యవసాయం బోరు బావుల పైనే ఆధారపడాల్సి వస్తుంది
-నీటి సమస్య.. కరెంటు సమస్య రాబోతుంది…
-కరెంటు జీవనంలో భాగమైంది. కరెంట్ కే మొదటి ప్రాధాన్యత…
-పని వాతావరణం కల్పించే బాధ్యత నాది..పనిచేసే బాధ్యత మీది..
-విద్యుత్ శాఖ సమీక్షలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
చౌటుప్పల్/ అక్షిత న్యూస్
ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని దీని ప్రభావంతో వర్షాలు తక్కువ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం బోరుబావుల పైన వ్యవసాయం ఆధారపడి ఉందని ఆ బోరుబావులకు విద్యుత్ సక్రమంగా అందిస్తూ ఎటువంటి సమస్య లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కరెంట్ అనేది జీవనంలో భాగమైందని కరెంటుకి మొదటి ప్రధానమంత్రి ఇవ్వాలన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని విద్యుత్లో రోల్ మోడల్ గా చేయడంలో భాగంగా మొదటగా మండల కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ సమస్యలు లేకుండా చేసి, తర్వాత గ్రామాలలోని విద్యుత్ సమస్యల పరిష్కారం, అనంతరం వ్యవసాయ బావుల లైన్స్ ను విడతల వారీగా అభివృద్ధి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మొదటగా అన్ని మండల కేంద్రాలలో గృహాలపై విద్యుత్ తీగలు లేకుండా లైన్స్ షిఫ్ట్ చేసి ఎటువంటి విద్యుత్ సమస్య లేకుండా అంచనాలు రూపొందించాలన్నారు. పనిచేయాల్సిన బాధ్యత మీదని నిధులు తేవాల్సిన బాధ్యత నేను చూసుకుంటానన్నారు.
–మునుగోడు ఏఈ నరేందర్ ని ఫోన్ లో పరామర్శించిన ఎమ్మెల్యే…
ఇటీవల సిబ్బంది అధికారుల పని ఒత్తిడి, వేధింపుల వల్ల ఇబ్బంది పడుతూ ఆసుపత్రి పాలైన మునుగోడు ఏఈ నరేందర్ ను ఫోన్లో పరామర్శించారు.డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన బాధ్యత పై స్థాయిలో ఉన్న అధికారులపై ఉందని మందలించారు. నరేందర్ కు ధైర్యం చెబుతూ వెంటనే విధులకు హాజరుకావాలని నేను నీకు భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు.
-లో వోల్టేజి సబ్ స్టేషన్ ల నిర్మాణం పై ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్ కి ఫోన్…
వర్షభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బోరుబావుల పైన విపరీతమైన ఒత్తిడి ఉండడంతో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా లో వోల్టేజ్ సమస్య అధికమవుతుందని, అదేవిధంగా నిర్మించాల్సిన మంజూరైన సబ్ స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేసే విధంగా సహకరించాలని ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ కి ఫోన్లో వివరించారు.. సీఎండీ కృష్ణ భాస్కర్ మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా సబ్ స్టేషన్ల పనితీరుపై చర్చించారు. ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 31 సబ్స్టేషన్లు పనిచేస్తుండగా కొత్తగా నిర్మించిన 6 సబ్స్టేషన్లు ఉపయోగం లోకి వచ్చాయి. మరో 3 సబ్ స్టేషన్లు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉండగా ఇంకో 6 సబ్స్టేషన్లు మంజూరై టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. మరో 3 సబ్స్టేషన్లు మంజూరై భూమి కేటాయింపు స్టేజిలో ఉన్నాయి. వివిధ దశలలో ఉన్న ఈ సబ్ స్టేషన్ లను త్వరితగతిన పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా భద్రతతో కూడిన నాణ్యమైన కరెంటుని ఇచ్చే విధంగా కరెంట్ అభివృద్ధి పనులు చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ ఈ. సురేష్, నల్గొండ కన్స్ట్రక్షన్ డిఈ నరసింహ, దేవరకొండ డిఈ బాల్య నాయక్, నల్గొండ డీఈ విద్యాసాగర్, చౌటుప్పల్ డిఇ మల్లికార్జున్, నాంపల్లి మునుగోడు, చౌటుప్పల్ ఏడీఈలు, అన్ని మండలాల ఏఈ లతోపాటు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.