విపత్తుల వేళ అప్రమత్తంగా ఉండాలి….!

విపత్తుల వేళ అప్రమత్తంగా ఉండాలి….!

 ఆపద మిత్రలు ప్రజలకు అండగా నిలవాలి…

వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్ భుజంగరావు…

నిజామాబాద్, అక్షిత ప్రతినిధి

ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తులు సంభవించిన సమయంలో ఆపద మిత్ర వాలంటీర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు తక్షణ సహాయ సహకారాలు అందించాలని అదనపు కలెక్టర్ వి. భుజంగరావు సూచించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆపద మిత్ర వాలంటీర్లకు విపత్తుల సమయంలో ఉపయోగపడే 14 రకాల అత్యవసర ఉపకరణాలతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారులు కిట్‌లోని పరికరాల వినియోగం, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే చర్యలు, అత్యవసర ప్రాథమిక చికిత్స, సీపీఆర్ నిర్వహణ వంటి అంశాలపై వాలంటీర్లకు అవగాహన కల్పించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ, విపత్తులను పూర్తిగా నివారించడం ఎవరి వల్లా సాధ్యం కాదని, అయితే ముందస్తు సన్నద్ధతతో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆపద మిత్ర వాలంటీర్లు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందిస్తూ ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఇప్పటికే నిపుణుల ద్వారా అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఆపద సమయంలో సమర్థవంతంగా సేవలు అందించాలని, అదే సమయంలో స్వీయ రక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.జిల్లా రెవెన్యూ అధికారి గీత మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావించాలని అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి, ఆపద మిత్ర నోడల్ అధికారి సాయన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ఆపద మిత్ర వాలంటీర్లకు ఉచిత శిక్షణతో పాటు గుర్తింపు కార్డులు, ప్రత్యేక కిట్లు అందజేస్తోందని, బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ డీ-సెక్షన్ పర్యవేక్షకులు శ్రీనివాస్‌రావు, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ అధికారులు, 7వ పోలీసు బెటాలియన్ అధికారులు, ఆపద మిత్ర వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking