మెరుగైన విద్యుత్ సరఫరాకు ‘ప్రజాబాట’

మెరుగైన విద్యుత్ సరఫరాకు ‘ప్రజాబాట’

– సైబర్ సిటీ సర్కిల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్,

– ఇబ్రహీంబాగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ చంద్ర

– ఇంటింటికీ వెళ్లి వినియోగదారుల సమస్యల పరిష్కారం

– నెమలి నగర్‌లో విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్టు 6 (అక్షిత ప్రతినిధి):

వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు విద్యుత్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా “ప్రజాబాట – బస్తీ బాట” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సైబర్ సిటీ సర్కిల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇబ్రహీంబాగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ చంద్ర తెలిపారు. గ్రేటర్ సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని ఇబ్రహీంబాగ్ డివిజన్, నార్సింగ్ సెక్షన్ నెమలి నగర్ కాలనీలో గురువారం తెలంగాణ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి వినియోగదారులను కలుసుకుని వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కరించే చర్యలు చేపట్టారు.విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు, పాత విద్యుత్ పరికరాల మార్పిడి, భద్రతా చర్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసి తక్షణ చర్యలు చేపట్టారు. అలాగే విద్యుత్ సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులు, సిబ్బందిని ఎలా సంప్రదించాలి, ఫిర్యాదులను ఎలా నమోదు చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించే విధానం, విద్యుత్ వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించిన సూచనలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నప్పుడు ఫిర్యాదు చేసే విధానం, సౌర విద్యుత్ (సోలార్) ఏర్పాటు, ప్రభుత్వ రాయితీలు, వినియోగదారులకు అందుబాటులో ఉన్న సేవల గురించి అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడం ద్వారా విద్యుత్ సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందన్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ, ప్రతి ఫిర్యాదును నమోదు చేసి దశలవారీగా పరిష్కరిస్తున్నామని, వర్షాకాలంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంబాగ్ ఇంచార్జి ఏడిఈ డి. సైదులు ఏఈలు, లైన్ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking