ఆకస్మిక అస్వస్థతతో రైతు మృతి
రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య (46) ఆకస్మికంగా అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి భార్య రేవనాల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆగస్టు 5న సాయంత్రం ఆమె తన భర్త ఐలయ్య, కుమార్తె శివమణితో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం దుబ్బాక రోడ్డులోని తమ పొలానికి వెళ్లి పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. అనంతరం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రకు సిద్ధమవుతున్న సమయంలో ఐలయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయి, నోటి నుంచి నురుగు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రాత్రి 11 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రామన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.