ఆసుపత్రిలో నిర్లక్ష్యం సహించం…
సమయపాలన తప్పనిసరి…
డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఆకాష్
లోకేశ్వరం, ఆగస్టు 6 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భైంసా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఆకాష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ రికార్డులను పరిశీలించి, వైద్య సేవల తీరును సమీక్షించారు.అనంతరం వైద్యులు, సిబ్బందితో మాట్లాడిన డాక్టర్ ఆకాష్.. ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరూ కచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. విధులకు ఆలస్యంగా రావడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రోగులను వేచి ఉండేలా చేయడం వంటి చర్యలు సహించబోమని హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.వర్షాకాలంలో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరంతో వచ్చే ప్రతి రోగిని క్షుణ్ణంగా పరీక్షించి అవసరమైన చికిత్స అందించాలని, ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వైద్యులు, సిబ్బందికి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఆకాష్ సూచించారు…