ఎంపీడీవోపై సర్పంచుల మండిపాటు సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం…
సర్వసభ్య సమావేశంలో అధికారిని నిలదీసిన ప్రజాప్రతినిధులు
లోకేశ్వరం, ఆగస్టు 6 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గ్రామాల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీడీవో రామకృష్ణపై పలువురు సర్పంచులు మండిపడ్డారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశానికి బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ దయానంద్, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి అధ్యక్షత వహించారు.సమావేశానికి ముందు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం గ్రామాల అభివృద్ధి, జలసిరి పథకం, పారిశుధ్యం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం, అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా స్పందించడం లేదని ఎంపీడీవోను నిలదీశారు. ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, గ్రామాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.దీనిపై స్పందించిన ఎంపీడీవో రామకృష్ణ మాట్లాడుతూ, సర్పంచులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎంపీఓ సోలమన్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలసిరి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, పొలాల్లో ఫామ్‌పాండ్లు, ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు ప్రోత్సాహకం అందిస్తోందని తెలిపారు. వైద్యశాఖ అధికారులు వర్షాకాలంలో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణకు గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలకు సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మార్వో సూర్యారావు,సర్పంచుల సంఘం అధ్యక్షుడు భుజంగరావు, స్థానిక సర్పంచ్ దర్వాడి కపిల్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు,వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు…